ప్రభుత్వ ఉద్యోగాల నియమాకాల్లో ఇప్పుడు టెక్నాలజీ వాడకం బాగా పెరిగింది. పరీక్ష పత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ నుంచి మార్కుల గణన వరకూ అంతటా యంత్రాలతోనే పని. మనుషుల జోక్యం కారణంగా అక్రమాలు జరిగే అవకాశం ఉండటం వల్లే ఈ ఏర్పాటు. కానీ ఉన్నతస్థాయి ఉద్యోగాలకు రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ కూడా ఉండటం వల్ల అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.


అందుకే వైఎస్ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ పరీక్షల్లో ఇంటర్వ్యూలను తీసేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా నియామకమయ్యే ఉద్యోగాలన్నింటికీ ఇంటర్వ్యూ ను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు.


ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి కి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా ఇకపై అత్యంత పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేయాలని ఆదేశించారు. వచ్చే జనవరి నుంచి ఏటా ఉద్యోగాల భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సీఎం... భర్తీ చేసే విధివిధానాలపై చర్చించేందుకు సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీకి ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతా రామాంజనేయులు , ఉన్నతాధికారులు హాజరయ్యారు. కీలక ఉద్యోగాల భర్తీలో ప్రస్తుతం ఇంటర్వ్యూలు నిర్వహించే విధానం అమలుతీరుపై చర్చించారు .


ఇంటర్వ్యూల నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. దీంతో ఇకపై భర్తీ చేసే నియామకాల్లో ఇంటర్వూలు నిర్వహించే విధానాన్ని రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి భర్తీచేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలని నిర్ణయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: