ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన నన్నయ యూనివర్సిటీ ప్రొఫెసర్ లైంగిక వేధింపుల కేసులో పోలీసులు ముందడుగు వేశారు. ఇంగ్లీషు అసిస్టెంట్ ప్రొఫెసర్ నిమ్మగడ్డ సూర్య రాఘవేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవేంద్రను కృష్ణా జిల్లా నందిగామలో అరెస్ట్ చేసిన పోలీసులు రాజమండ్రిలో కోర్టులో హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

 

 

ప్రొఫెసర్ రాఘవేంద్ర లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గతంలో విద్యార్థినులు సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన సీఎం.. విచారణ చేపట్టాలని విద్యాశాఖను ఆదేశించారు. విచారణలో రాఘవేంద్ర లైంగిక దాడికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో నిందితుడు నిమ్మగడ్డ సూర్య రాఘవేంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటివలే ఈ కేసుపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా ఈ ఆరోపణలపై సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఎస్పీతో మాట్లాడి విచారణ త్వరగా చేపట్టాలని ఆదేశించారు. ఈ ఘటనపై కమిటీ విచారణ అనంతరం రాఘవేంద్రరావు ఆరోపణలు నిజమని తేల్చారు. అంతకుముందు వీసీ ఈ ఆరోపణలు నిజం కాదని కూడా ప్రకటన చేశారు. వారు పూర్వ విద్యార్ధులని తెలిపారు. దీనిపై ప్రత్యేక కమిటీ చేసిన విచారణలో రాఘవేంద్రరావుపై వచ్చిన ఆరోపణలు నిజమని తేల్చారు.

 

 

ప్రొఫెసర్‌ను అరెస్టు చేసి, విద్యార్థినులకు న్యాయం చేయాలని కోరుతూ ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాఘవేంద్రపై 489/2019 అండర్‌ సెక్షన్‌ 354 (ఎ), 354 (డి), 509, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇతన్ని శుక్రవారం రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరచనున్నారు. దర్యాప్తులో భాగంగా ప్రత్యేక విచారణాధికారిగా ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ శ్రావణి నిందితుడిని అరెస్టు చేసినట్టు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: