మీడియా స్వేచ్చ, విలేకరులపై కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబునాయుడు బుద్ధులు చెప్పటమే విచిత్రంగా ఉంది. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా తప్పుడు కథనాలు, అసత్యాలు ప్రచురించి, ప్రసారాలు చేయటంపై జగన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.  ఈ విషయమీదే ప్రతిపక్షాలు ప్రధానంగా తెలుగుదేశంపార్టీ మండిపోడిపోతోంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మీడియా స్వేచ్చ ముసుగులో ఎల్లోమీడియా అప్పట్లో వైఎస్సార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగాను, ఇపుడు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కథనాలను అచ్చేస్తోంది. నోటికొచ్చిన కథనాలను ప్రసారం చేస్తోంది.  వీటిన్నింటినీ ఎవరూ అడగకూడదన్నది ఎల్లోమీడియా ఉద్దేశ్యం. ఎవరైనా గట్టిగా అడిగితే మీడియా స్వేచ్చపై దాడంటూ నానా యాగీ చేస్తున్నారు.

 

నిజానికి మీడియా స్వేచ్చకు సంకెళ్ళు ఇపుడు కాదు చంద్రబాబు హయాంలోనే పడింది. ఎలాగంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తనకు వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా రాకుండా చంద్రబాబు చూసుకుంటారు. చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా కథనాలు, వార్తలు రాసి ఉద్యోగాలు పోగొట్టుకున్న విలేకరులు ఎంతోమందున్నారు.

 

చంద్రబాబుకు సంబంధించినంత వరకూ మీడియా స్వేచ్చ అంటే కేవలం యజమానుల స్వేచ్చ మాత్రమే. వార్తలు రాసే విలేకరులు ఏమి రాయాలి, ఎలా రాయాలన్నది యాజమాన్యమే నిర్ణయిస్తుంది. నిజానికి సాక్షి మీడియా వచ్చేంత వరకూ చంద్రబాబుకు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు ప్రచురించే మీడియా దాదాపు లేదనే చెప్పాలి.

 

ఆకాశమే హద్దుగా అవినీతి జరిగింది చంద్రబాబు హయాంలో. అధికారులపై ఎంఎల్ఏలు, ఎంపిలు విచక్షణా రహితంగా దాడులు చేశారు. సాక్షి తప్ప దాన్ని గట్టిగా హైలైట్ చేసిన మీడియా ఉందా ?  చంద్రబాబు హయాంలో జరిగిన అనర్ధాలు, అవినీతి, అరాచకాల ఫలితాలే ఇపుడు జగన్ ప్రభుత్వం అనుభవిస్తోంది.

 

అదేదో జగన్ హయాంలోనే జరిగినట్లుగా ఎల్లోమీడియా ప్రత్యేక కథనాలు ప్రచురిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో మంచి నిర్ణయాలు తీసుకున్నారు. వాటిపై ఎల్లోమీడియా కథనాలు ఇచ్చిందా ? చేస్తున్న మంచి పనుల్లో కూడా బొక్కలున్నాయేమోనని వెతికి మరీ వాటిని మాత్రమే ప్రధానంగా ఎత్తి చూపుతున్నాయి.

 

ఇదంతా ఎల్లోమీడియా ఎందుకు చేస్తోందంటే కేవలం చంద్రబాబుతో ఉన్న సంబంధాల వల్లే అని అందరకీ తెలిసిందే. మీడియా స్వేచ్చను హరించాలని ఎవరు చూసినా తప్పే. కానీ మీడియా స్వేచ్చ ముసుగులో  ఉద్దేశ్యపూర్వకంగా బురద చల్లుదామని ప్రయత్నించటాన్ని ఎలా అడ్డుకోవాలి ? జగన్ ప్రభుత్వం చేస్తున్నది ఇదే.


మరింత సమాచారం తెలుసుకోండి: