తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె రెండు వారాల నుండి జరుగుతోంది. ఆర్టీసీ కార్మికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం పట్టుదలకు పోతూ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాల్సి ఉంది. హైకోర్టు సూచించినప్పటికీ ప్రభుత్వం కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు ఇవ్వలేదు. 
 
ఆర్టీసీ జేఏసీ ఈరోజు హైకోర్టు ద్వారా పరిష్కారం లభించని పక్షంలో రేపు బంద్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్మికుల సమ్మె వలన ప్రజల ఇబ్బందులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రైవేట్ ఆపరేటర్లు, క్యాబ్ కంపెనీలు అధిక మొత్తంలో ప్రయాణికుల నుండి వసూలు చేస్తున్నాయి. ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ల అనుభవ రాహిత్యం వలన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 
 
గ్రామాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలుస్తోంది. కార్మికుల సమ్మె వలన కూరగాయల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. గ్రామాల నుండి నగరాలకు వచ్చి రోజువారీ పనులు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ముగుస్తూ ఉండటంతో పాఠశాలల, కాలేజీల బస్సులు ప్రభుత్వం వెనక్కు ఇచ్చేయాల్సి ఉంది. 
 
రేపటినుండి ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మెకు దిగబోతున్నారు. కోర్టు ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరపలేదు. ఆర్టీసీకి ఎండీని కూడా ప్రభుత్వం నియమించలేదు. కోర్టు ఇచ్చిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవటంతో ప్రభుత్వంపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో కూడా చూడాల్సి ఉంది. పలు ప్రాంతాలలో ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా పరకాలలో తాత్కాలిక కార్మికులు బస్సుడిపోల్లోకి వెళ్లకుండా ఆర్టీసీ కార్మికులు అడ్డు పడినట్లు తెలుస్తోంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టారని సమాచారం అందుతుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: