తెలంగాణ‌లో ఆర్టీసీ స‌మ్మె ఉధృత రూపం దాల్చుతోంది. 19వ తేదీన బంద్ నిర్వ‌హించేందుకు టీఆర్ఎస్ మిన‌హా మిగ‌తా పార్టీలు, అనుబంధ సంఘాలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. బంద్‌కు అంతా మద్దతిచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాయి. ఆర్టీసీ సమ్మెతోపాటు ఉద్యోగులకు సంబంధించిన 17 అంశాలపై ఉద్యోగ జేఏసీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి వినతిపత్రం సమర్పించింది. సీఎస్‌తో వివిధ అంశాలపై చర్చించింది. మ‌రోవైపు, బీజేపీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా భారీ ఉద్య‌మానికి బీజేపీ నాంది పలుకుతుందని ప్ర‌క‌టించింది.


ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను రాష్ట్ర రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ క‌లిసి వివ‌ర‌ణ ఇచ్చారు. ప్రస్తుతం 9వేల బస్సులు నడుస్తున్నాయని, ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయకుండా అరికట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని సునీల్‌శ‌ర్మ‌ పేర్కొన్నారు. టికెట్ల జారీకి యంత్రాలను వినియోగిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై రాజకీయపార్టీలు, సంస్థలు పలు ప్రతిపాదనలు తీసుకొచ్చాయని ఈ సందర్భంగా గవర్నర్‌ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లుచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ సునీల్‌శర్మను ఆదేశించారు. 


ఇక బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ....ప్రభుత్వానికి అన్ని వర్గాలు ప్రజలు, ప్రజా సంఘాలు కుల సంఘాలు ఎదురుతిరిగాయ‌ని తెలిపారు. గురువారం నుంచి ఉబెర్, ఓలా కార్మికులు ఉద్యోగులు అన్ని క్యాబ్ డ్రైవర్లు కూడా నిరవధిక సమ్మెకు మద్దతు పలుకుతున్నారని వెల్ల‌డించారు. ఆర్టీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంద‌ని, రాష్ట్రంలో కార్యకలాపాలు స్తంభించాయని పేర్కొన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తుంటే...అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని అనుమానంగా ఉందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నప్ప‌టికీ...రవాణా శాఖ మంత్రి స్పందించకపోవడం బాధాకరమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. పాలన అటకెక్కించి కేవలం తన ప్రతిష్ట కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిప‌డ్డారు. మ‌ళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా భారీ ఉద్య‌మానికి బీజేపీ నాంది పలుకుతుందని ఈ సంద‌ర్భంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.


కాగా, హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బస్ భవన్ వరకు కార్మికులు బైక్ ర్యాలీ చేపట్టారు. బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ఆర్టీసీ జేఏసీ క‌న్వీన‌ర్‌ అశ్వత్థామ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కాసేపటికే ఆయన్ని వదిలేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అశ్వత్థామ రెడ్డి.. ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరపాలన్నారు. అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...ప్రభుత్వ వైఖరిని హైకోర్టులో ఎండగడతామని అన్నారు. ప్రజలందరూ తమ సమ్మెకు మద్దతు తెలుపాలని, మేధావులు స్పందించాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: