తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం దగ్గర గోదావరి నదిలో సెప్టెంబర్ నెల 15వ తేదీన బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. గోదావరిలో వరద ప్రవాహం తగ్గటంతో నాలుగు రోజుల క్రితం ధర్మాడి సత్యం బృందం బోటు వెలికితీత పనులు ప్రారంభించింది. ఈరోజు చేసిన ప్రయత్నంలో లంగర్లకు బోటు చిక్కలేదని తెలుస్తోంది. విశాఖ జిల్లా నుండి దుబాసీలు వస్తే తప్ప బోటు బయటకు తీయలేమని ధర్మాడి సత్యం బృందం చెబుతోంది. 
 
నిన్న ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నంలో బోటు రెయిలింగ్ రావటంతో ధర్మాడి సత్యం  సభ్యులు బోటు ఆచూకీ సులభంగానే దొరికే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం 50, 60 అడుగుల లోతులో బోటు ఉందని విశాఖ నుండి దుబాసీలు వచ్చి సహాయం చేస్తే తప్ప బోటు బయటకు తీయలేని పరిస్థితి ఉందని ధర్మాడి సత్యం బృందం చెబుతోంది. 
 
కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ పర్యవేక్షణలో బోటు వెలికితీత పనులు జరుగుతున్నాయి. బోటు ప్రమాదంలో గల్లంతయిన వారిలో 38 మంది మృతదేహాలు లభ్యం కాగా మరో 13 మృతదేహాలు ఇంకా లభ్యం కావాల్సి ఉంది. ధర్మాడి సత్యం బృందం సంప్రదాయ పద్దతిలో ప్రయత్నాలు చేసింది. బోటులో మొత్తం 77 మంది ప్రయాణించగా 26 మంది మాత్రం ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. 
 
ఆచూకీ దొరకని 13 మంది మృతదేహాలు బోటులో చిక్కుకొని ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. రాయల్ వశిష్ట బోటు వెలికితీస్తే మాత్రమే 13 మృతదేహాల గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ధర్మాడి సత్యం బృందం విశాఖ నుండి దుబాసీలు వచ్చిన తరువాత బోటును బయటకు తీసే అవకాశాలు ఐతే ఉన్నట్లు తెలుస్తోంది. బోటును త్వరగా వెలికితీసి మృతదేహాలను అప్పగించాలని గల్లంతయిన వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: