ఈ నెల 21వ తేదీన జరగబోతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందా? అనే ప్రశ్నకు విజయం సాధించటం అంత తేలిక కాదనే సమాధానం రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తోంది. హుజూర్ నగర్ నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుండి ఒక్కసారి కూడా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విజయం సాధించలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం కూడా ఈ ఉప ఎన్నికపై తప్పక ఉంటుందని తెలుస్తోంది. 
 
ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన రెండు వారాల నుండి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ప్రయాణికులకు బస్సులు అందుబాటులో ఉండటం లేదు. సమ్మె ప్రభావంతో కూరగాయల రేట్లు కూడా భారీగా పెరిగాయి. ప్రభుత్వం 48,000 మంది ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నట్లుగా ప్రకటించటం పట్ల సామాన్య ప్రజల నుండి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. 
 
 ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తాత్కాలిక డ్రైవర్లను నియమిస్తున్నప్పటికీ తాత్కాలిక డ్రైవర్ల అనుభవ రాహిత్యం వలన ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రయాణికులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీని కారు గుర్తును పోలి ఉన్న రెండు గుర్తులు కూడా భయపెడుతున్నాయని తెలుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండబోతుందని తెలుస్తోంది. 
 
టీడీపీ, బీజేపీ పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ ఈ రెండు పార్టీల ప్రభావం పెద్దగా ఉండదని తెలుస్తోంది. సాధారణంగా ఉప ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయి. కానీ ఆర్టీసీ సమ్మె ప్రభావం వలన ఫలితాల్ని అంచనా వేయటం కష్టమవుతోంది.  సీఎం కేసీయార్ హుజూర్ నగర్ బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉన్నా వర్షం కారణంగా పర్యటన రద్దైన విషయం తెలిసిందే. ఈ నెల 24వ తేదీన హుజూర్ నగర్ ఫలితం వెలువడనుంది. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: