ఉద్యమ సెగ ఎలాగుంటుందో కెసియార్ కు బహుశా మొదటిసారి అనుభవంలోకి వస్తున్నట్లుంది. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం విజయవంతమయ్యేందుకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరినీ కెసియార్ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎగదోశారు. అదే ఉద్యమసెగ ఇపుడు కెసియార్ నే ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది.

 

డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు 15 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సమ్మె నోటిసిచ్చినపుడు కెసియార్ అసలు కార్మిక సంఘాలను లెక్కలోకే తీసుకోలేదు. తనను ఎదిరించి తెలంగాణాలో ఎవరు కూడా ఉద్యమాలు చేసేంత సీన్ లేదని అనుకున్నారు. సీన్ కట్ చేస్తే సమ్మె ఉధృతం చేసిన ఆర్టీసీ కార్మికులు, మరోవైపు న్యాయస్ధానం ఆదేశాలు, ఇంకో యాంగిల్లో గవర్నర్ యాక్టివ్ పార్టు తీసుకోవటం, సమ్మెకు టిఎన్జీవోల మద్దతు పలకటంతో కెసియార్ లో సఫకేషన్ మొదలైంది.

 

తాజాగా ప్రభుత్వానికి  కోర్టు ఆదేశాలు చూస్తే కెసియార్ కు తలంటు పోసినట్లే ఉంది. మూడు రోజుల్లో ఆర్టీసీ యూనియన్లతో చర్చలు పూర్తి చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. చర్చల విషయంలో కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించటమంటే ఏమిటర్ధం ?  అదే సమయంలో ఆర్టీసీ యూనియన్ల 45 డిమాండ్లలో చర్చలు జరిపితే 22 సులభంగా పరిష్కారమయ్యేవే అని కూడా కోర్టు ప్రభుత్వానికి సూచించింది.

 

సో కెసియర్ కు ఇష్టమున్నా లేకపోయినా కోర్టు ఆదేశాల నేపధ్యంలో యూనియన్లతో చర్చలు జరపక వేరే దారిలేదు.  అదే సమయంలో సమ్మె వివరాలను ఎప్పటికప్పుడు

గవర్నర్ తమిళిసై తెప్పించుకుంటున్నారు. అంటే తెప్పించుకున్న వివరాల సారాంశాన్ని కేంద్రప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నారనే అనుకోవాలి. అదే సమయంలో టిఎన్జీవోలు కూడా సమ్మెకు మద్దతు పలకటం గోరు చుట్టుమీద సమ్మెటపోటు లాగ తయారైందనే చెప్పాలి.

 

అన్నీ వైపుల నుండి ఉద్యమ సెగ కమ్ముకుంటున్న కారణంగా కెసియార్ బాగా సఫకేటింగ్ ఫీలవుతున్నారనటంలో సందేహం లేదు. దీనికి అదనంగా సమ్మెకు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల మద్దతు,  హుజూర్ నగర్లో ఉపఎన్నిక లాంటివి కెసియార్ ను సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి. మొత్తంమీద అధికారంలోకి వచ్చిన 6 ఏళ్ళ తర్వాత కెసియార్ కు ఉద్యమసెగ అంటే ఎలాగుంటుందో తెలిసి వస్తున్నట్లే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: