ఆంధ్రజ్యోతి పత్రిక తెలుగు దేశానికి అనుకూలంగా ఉంటుందని చాలామంది భావిస్తారు. అంతే కాదు. అదే సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా రాస్తుందని కూడా చాలామంది భావిస్తారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఈ వైరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి కూడా ఉంది. తాజాగా జగన్ సీఎం అయిన తర్వాత కూడా ఇదే సీన్ కంటిన్యూ అవుతోంది.


వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆంధ్రజ్యోతి పత్రిక పనిగట్టుకుని విషప్రచారం చేస్తోందని వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం ప్రజారంజకంగా పాలన చేస్తుంటే చూడలేక కొందరు ఈర్ష్య తో వార్తలు రాస్తున్నారని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.


గత తెదేపా ప్రభుత్వానికి బాకా కొట్టిన వారికి తమ ప్రభుత్వ పాలన రుచించటం లేదని విమర్శిస్తూ మొహమాటం లేకుండా ఆంధ్రజ్యోతి పేరు కూడా చెప్పేశారు. ఆంధ్రజ్యోతి కథనాలను మీడియా ముందు ప్రదర్శించారు. సచివాలయ ఉద్యోగాల్లో ఒకరికో ఇద్దరికో మంచి మార్కులు వస్తే పేపర్ లీక్ అని నిరాధార వార్తలు రాశారని మండిపడ్డారు.


ఇదే సమయంలో పేర్ని నాని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్కే చంద్రబాబుకు వీరాభిమానిగా వర్ణించారు. ఎల్టీటీఈ ప్రభాకర్ కోసం తనను తాను పేల్చుకున్న థాను లాగా చంద్రబాబు కోసం ఆర్కే ఆత్మాహుతికైనా సిద్ధపడతాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదన్న పేర్ని నాని.. తమ ప్రభుత్వం లక్షల మందికి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చినా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.


ఆర్టీసీలో బస్సుల కొనుగోలుకు ఇంకా ప్రభుత్వం విధివిధానాలే రూపొందించలేదని... అప్పుడే వ్యతిరేక వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. శ్రీలంకలో ఎల్టీటీఈ కోసం ఆత్మాహుతి చేసుకునే తరహాలోనే చంద్రబాబు కోసం కూడా సదరు మీడియా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పత్రికలది మంచి జర్నలిజమే అయితే ఆర్టీసి ఎండీ ఇచ్చిన వివరణను ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన రిజాయండర్ ప్రచురించకుండా ఏ జర్నలిజం విలువలు పాటిస్తున్నారని నిలదీశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: