జగన్ అంటే వైసీపీ ఎమ్మెల్యేలకు ఇష్టం. ఆయన తమ నాయకుడు కాబట్టి. ఆయన గురించి ఏమైనా చేస్తారు. ఫొటోలకు దండలు వేస్తారు, చిత్రపటాలకు పాలాభిషేకాలు కూడా చేస్తారు. అయితే జగన్ విషయంలో విపక్ష ఎమ్మెల్యే ఒకరికి అలా చేయాలనిపించడమే వింతా,విశేషం. ఆయన గారి పార్టీ అధినాయకుడు నిత్యం జగన్ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన మాత్రం జగన్ని కొలవడం విడ్డూరమే.


విషయానికి వస్తే వైఎస్సార్ వాహనమిత్ర పధకం ప్రవేశపెట్టిన సంగతి విధితమే. తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన జనసేన ఎమ్మెల్యే రాజోలులో జరిగిన ఓ కార్యక్రమంలో  ఆటోడ్రైవర్లతో కలసి జగన్ని అభినందించారు. జగన్ ఒక్కో ఆటో డ్రైవర్ కి పది వేల రూపాయలు వంతున ఏడాదికి ఇవ్వడం ద్వారా దేవుడు అయిపోయారని ఆటో డ్రైవర్లు అన్నారు. 


ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ తో కలసి ఎమ్మెల్యే వరప్రసాద్ జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం సంచలనం రేపుతోంది. ఇంతకు ముందు కూడా ఈ ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా జగన్ని పొగుడుతూ ప్రసంగాలు చేశారు. జగన్ పేదలకు దేవుడిగా మారారని కొనియాడడం అప్పట్లో విపరీత చర్చకు దారితీసింది.


ఇపుడు ఇలా వీరాభిమానం చూపిస్తూ చిత్రపటానికి పాలాభిషేకం చేయడాన్ని ఎలా సమర్దించుకుంటారో చూడాలి. మరో వైపు ఇదే రోజున హైదరాబాద్ లో పవన్ పార్టీ మీటింగ్ పెట్టి మరీ జగన్ని మరో మారు విమర్శించడం విశేషం. మరి ఒకే పార్టీలో అధినేత అలా, ఎమ్మెల్యే ఇలా.. ఇదంతా చూస్తూంటే ఎక్కడో తేడా కొడుతోందనిపిస్తోంది.  మరి ఆ ఎమ్మెల్యే గారు ఇలా మనసులో మాటను చెప్పకుండా మెరుపులు మెరిపిస్తున్నారు. చేయాల్సింది చేతల్లో చూపిస్తున్నారని అంటున్నారు. పరిస్థితి చూస్తూంటే ఆయన సొంత పార్టీలో ఎక్కువ రోజులు ఉంటారా అన్న డౌట్లు వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: