తెలుగు దిన పత్రికలు నిస్పక్షపాతంగా వార్తలు రాసి చాలా ఏళ్లయిపోయింది. ఒక్కో పత్రిక ఒక్కో పార్టీకి బాకా పత్రికలుగా మారాయన్న విమర్శలు బాగా పెరిగిపోయాయి. అయితే ఆంధ్రజ్యోతి పత్రిక తెలుగు దేశానికి అనుకూలం అన్న పేరు ఉంది. అలాగే వైఎస్ హయాం నుంచి ఆయన కుటుంబంతో వైరం కనిపించింది.


అయితే చంద్రబాబు ఏం చేసినా ఆహా ఓహో అంటూ ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు రాయడం వల్లే చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సీ.రామచంద్రయ్య అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని తప్పుబడుతూ ప్రజల్లో దుష్ప్రచారం చేస్తూ సీఎం వైయస్‌ జగన్‌పై అయిష్టతను ఏర్పరిచే ప్రయత్నం జరుగుతుందన్నారాయన. చంద్రబాబు భజన చేసే పత్రికలు, ఛానళ్లు నాలుగు నెలల పాలన పూర్తికాకముందే ప్రతి రోజూ ప్రభుత్వంపై విషం కక్కుతున్నాయన్నారు.


జర్నలిజం విలువలను దిగజార్చుతూ ఓ పత్రికా పిచ్చి రాతలు రాస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సీ.రామచంద్రయ్య మండిపడ్డారు. చంద్రబాబు పాలన అద్భుతంగా ఉండేదన్నట్లుగా చూపిస్తున్నారని, చంద్రబాబు పాలనలో అసంబద్ధ, అప్రజాస్వామిక విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎందుకు ఎత్తిచూపించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామచంద్రయ్య మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడే పచ్చ మీడియా రాతల వల్ల ఎవరు చెడిపోయారో గుర్తు తెచ్చుకోవాలన్నారు.


సీఎం వైయస్‌ జగన్‌ గురించి చాలా చెడ్డగా రాసిన ఎల్లోమీడియా ఏం దెబ్బతీయగలిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిమానం ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక పత్రికా అధిపతి వల్లే టీడీపీ నాశనం అవుతుందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ప్రజాస్వామ్య విలువలతో పత్రికను నడిపి ఉంటే చంద్రబాబుకు సరైన మార్గదర్శకం ఇచ్చి ఉంటే ఇంత దారుణంగా ఓడిపోయేవారు కాదు..


మాఫియా డాన్‌ మాదిరిగా మీడియా పుట్టుకకు చంద్రబాబు కారణం. చంద్రబాబు ఆయన క్రియేట్‌ చేసుకున్న ప్రపంచంలో బతుకుతున్నారు. అధికారంలో శాశ్వతం అనుకొని ఉన్నవి లేనట్లుగా.. లేనివి ఉన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కుల, వర్గ విభేదాలకు ఈ మీడియా డాన్లు కారణమని రామచంద్రయ్య విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: