ఆంధ్రజ్యోతి పత్రికపై సీఎం జగన్ కక్షకట్టారని ప్రతిపక్షనేత చంద్రబాబు ఆరోపించారు . పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. అయితే వైసీపీ నేతలు కూడా ఇందుకు ధాటిగానే సమాధానం ఇస్తున్నారు. గతంలో మీడియాపై ఆంక్షలు విధించింది ఎవరని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు పత్రికా స్వేచ్ఛ పేరుతో కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.


తమ ప్రభుత్వం ఏ ఒక్క మీడియాపై ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని ఎలా అంటారని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పత్రికా స్వేచ్ఛపై కొత్త చట్టాన్ని ఏమైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. ఉన్నవి లేనట్లు ఏ పత్రికలు అయితే రాస్తున్నాయో..వాటికి సంబంధించి ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారన్నారు.


ఏదైనా చట్టాన్ని సవరించామా అని ప్రశ్నించారు. కొత్తగా ఏదైనా చట్టాన్ని తీసుకువచ్చామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిపైనైనా ఎలాగైనా రాసుకోవచ్చు అని ఏ న్యాయస్థానమైనా తీర్పు ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఎవరైనా తప్పుడు రాతలు రాసినప్పుడు సంబంధించిన వ్యక్తులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.


ప్రభుత్వం ఏ పత్రికనైనా, మీడియానైనా రాకుండా అడ్డుకుందా అని నిలదీశారు. గతంలో చంద్రబాబు సాక్షి పత్రికను మీడియా సమావేశానికి రాకుండా అడ్డుకోలేదా అన్నారు. బయటకు పో..మైక్‌ తీయండి అని చంద్రబాబు హెచ్చరించలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్ని మొసలి కన్నీళ్లు కార్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. చంద్రబాబు సహజతత్వం అందరికీ తెలుసు అన్నారు.


గతంలో చంద్రబాబు మీడియాపై ఎంతగా చెలాయించారో చూశామన్నారు. మా ప్రభుత్వంలో వీసమెత్తు కూడా అలాంటి చెలాయింపులు లేవన్నారు. మా ప్రభుత్వం ఏదైనా ఒక అంశంపై చట్టవిరుద్ధంగా చేస్తున్నామని చెప్పే దమ్ము ప్రతిపక్షానికి ఉందా అని సవాలు విసిరారు. మా ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: