కూడు, గూడు, బట్ట .. ఇవీ సామాన్యుడి అవసరాలు. ఇవి కూడా తీరకుండానే కోట్ల మంది జీవితాలు గడుపుతున్నారు. ప్రత్యేకించి సొంత ఇల్లు అనేది చాలా మంది పేదల కల. ఆ కలను నిజం చేస్తామంటున్నారు ఏపీ సీఎం జగన్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని జగన్ సర్కారు చెబుతోంది. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలిచ్చేందుకు లబ్ధిదారులను గుర్తిస్తున్నారు.


ఇప్పటి వరకు 13 జిల్లాల్లో 20 లక్షల 50 వేల మంది లబ్ధిదారుల గుర్తించామని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ఇంకా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, గ్రామీణ ప్రాంతాల్లో 8.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 7 లక్షల మందిని గుర్తించామన్నారు. సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులను 5 లక్షలకు పైగా గుర్తించాం. ఇంకా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారని చెప్పారు.


ఇళ్ల స్థలాల కోసం 19 వేల ఎకరాలు రూరల్‌లో, పట్టణాల్లో 2,500 ఎకరాలు గుర్తించామన్నారు. ఇంకా 19 వేల ఎకరాల భూమి అవసరం ఉందన్నారు. దాదాపు రూ. 10 వేల కోట్లతో భూమిని సమీకరిస్తున్నామని చెప్పారు. ఒకేసారి ఇన్ని లక్షల పట్టాలు ఇవ్వడం దేశంలో మొదటిసారి అవుతుంది. సీఎం వైయస్‌ జగన్‌ ఖచ్చితంగా ఈ రికార్డు సాధిస్తారన్నారు.


ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్న మాటను వైసీపీ సర్కారు నిలబెట్టుకుంటే.. పేదవాడు నిజంగా పండుగ చేసుకుంటాడు. ముందు ఇళ్లస్థలం అంటూ ఉంటే.. ఏదో ఒక రకంగా నివాసం ఏర్పాటు చేసుకుంటాడు. అప్పో సప్పో చేసి చిన్న గూడు నిర్మించుకుంటాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లవుతున్నా ఇంకా అందరికీ పక్కా ఇళ్లు అనేది నినాదంగానే ఉండిపోతోంది. జగన్ తాను అన్న మాట నిలబెట్టుకుంటే.. ఏపీలోనైనా అందరికీ పక్కా ఇల్లు సాధ్యం కావచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: