ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు సీఎం జగన్ అగ్రి గోల్డ్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా దాదాపు 265 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చిందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న 3,69,655 మందికి ఈ మొత్తాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. 
 
పది వేల రూపాయల లోపు డిపాజిట్లు ఉన్న వారందరికీ ఈ మొత్తాన్ని పంపిణీ చేసే విధంగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి కిషోర్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో అగ్రి గోల్డ్ బాధితులు ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వం నుండి వారికి తగిన న్యాయం జరగలేదు. ఆగ్రి గోల్డ్ బాధితులలో ఎక్కువమంది పేదలు, మధ్య తరగతి ప్రజలు, కూలీలు ఉన్నారు. 
 
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన మొదటి కేబినేట్ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర బడ్జెట్ లో 1,150 కోట్ల రూపాయలు ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల కొరకు కేటాయించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి కలెక్టర్లు, జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఛైర్మన్ ప్రతిపాదించిన ప్రతిపాదనల ప్రకారం 10,000 రూపాయలలోపు డిపాజిటర్ల జాబితాకు అనుగుణంగా పంపిణీ చేయనున్నారు. 
 
20,000 రూపాయల లోపు డిపాజిట్ల పంపిణీకి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ బాధితులు సంతోషం వ్యక్తం చేస్త్తున్నారు. గత ఐదేళ్లలో తగిన న్యాయం జరగకపోయినా సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలలలోనే న్యాయం చేస్తున్నాడని అగ్రిగోల్డ్ బాధితులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలలలోనే సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం విశేషం. 




మరింత సమాచారం తెలుసుకోండి: