మీడియా అంటే పరమ పవిత్రమైనది. ఓ విధంగా చెప్పాలంటే అద్దం లాంటిది. సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటూనే అవసరమైన సమయంలో చైతన్యపరచాలి. మరి మీడియా మొదట్లో సమున్నత విలువలు పాటించేది. తరువాత కాలంలో అంటే డెబ్బయి దశకం తరువాత కొత్త పత్రికల జోరులో మీడియా మెల్లగా తన పాత ఒరవడిని మార్చేసుకుంది. ఆ తరువాత నుంచి చాలా వరకూ మీడియా యజమానులు రాజకీయ కామందుల ఇంటి పెద్ద పాలేరు పాత్రకే పరిమితైపోయారు 


అన్న నందమూరి తారకరామారావు అక్షరాలా మీడియా కుట్రకే బలి అయిపోయారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన వైపు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా నాడు ఆధిపత్యపు మీడియా రాజకీయపైత్యం ఎన్టీయార్ ని ముందే మైనారిటీ ముఖ్యమంత్రిని చేసేసింది. ఆ తరువాత ఆయన్ని గద్దె దింపేవరకూ పోరాటం చేసింది. చివరికి ప్రజాస్వామ్యాన్ని పరిహసించి రెక్కలు విరిచి అనుకున్నది సాధించింది. మరి తరువాత కాలంలో ఈ విజయం ఇచ్చిన మత్తు మరింతగా విక్రుత చేష్టలకు పాల్పడే అవకాశం ఇచ్చేసింది. తమ వారు అధికారంలో ఉంటే ఓ విధంగానూ, గిట్టని వారు పవర్లో ఉంటే మరో విధంగాను రాతలు రాయడం కొన్ని మీడియా మేనేజ్మెంట్లకు అలవాటుగా మారిపోయింది. ప్రజలకు వాస్తవాలు చెప్పడం ఎపుడో మానేశారు.


దానికి బదులు తాము అనుకుంటున్నవి, వూహించినవి, ఇలా జరగాలని కోరుకుంటున్నవి వండి వార్చి వాటినే తమ కళ్లతో చూడమని, తమ మెదళ్ళతో ఆలోచించమని కొన్ని మీడియా మేనేజ్మెంట్లు గట్టిగా కోరుకుంటున్నాయి. ఇక మీడియా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడమూ  ఇటీవల చూస్తున్నాం. ఓ మీడియా అధిపతి ఏకంగా రాజకీయ పార్టీల అధినేతలను యధేచ్చగా కలుసుకోవడం, అదే సయంలో తనకు గిట్టని వారిని పూర్తిగా ద్వేషించడం కూడా తెలుగు మీడియా రంగంలోనే జరుగుతున్న తాజా ముచ్చట.


ఈ పరిణామాల నేపధ్యం  నుంచి చూసినపుడు మీడియా డాన్ అన్న పదాలను బాధిత రాజకీయ నాయకులు ఉపయోగించడం సబబేననిపిస్తోంది. అయితే దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా బలమైన మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించుకుని, దానికి, బలమైన కుల బలం, రాజకీయ బలాన్ని ఎరువుగా పోసి వట వ్రుక్షాల మాదిరిగా విస్తరించిన ఈ మీడియా డాన్ లను కట్టడి చేయడం సాధ్యమేనా అన్న అభిప్రాయం కూడా ఉంది. ఏది ఏమైనా కొంతమంది వ్యక్తుల చేతుల్లోని  మీడియా కూడా ఇపుడు రాజకీయాల్లో భాగమైపోయినందువల్ల వారి మీద ఎటువంటి ఆంక్షలు పెట్టినా ఏం చేసినా చింతించే ప్రజాస్వామిక ప్రియులు ఎవరూ లేరన్నది కఠోర సత్యం. ఈ రకమైన పరిస్థితి తెచ్చుకోవడం వారి స్వయంక్రుతాపరాధం.


మరింత సమాచారం తెలుసుకోండి: