తెలంగాణ ఎత్తులు- పై ఎత్తులు అనే కేంద్రంగా సాగుతున్న రాజ‌కీయాల్లో ఏపీ రాజ‌కీయాల్లో ముఖ్య‌ పాత్ర పోషిస్తున్న పార్టీల నేత‌ల గురించి ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ సాగుతోంది. వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి, సినీ న‌టుడు, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి...తెలంగాణ ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్​కు అన్ని వర్గాల మద్దతు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా బంద్​ను అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే.. సక్సెస్​ చేయాలని కార్మికుంతా పట్టుదలగా ఉన్నారు. ఈ త‌రుణంలో..ఈ ఇద్ద‌రు నేత‌ల వైఖ‌రి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 


ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్​కు సహకరించాలని ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తి చేసింది. అధికార టీఆర్‌ఎస్‌ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్​కు మద్దతు తెలిపాయి. బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన సహా అన్ని పార్టీలు బంద్​లో పాల్గొంటామని ప్రకటించాయి. అయితే, ఏపీలో అధికారంలో ఉండి...తెలంగాణ‌లో త‌న ఉనికి చాటుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న వైసీపీ మాత్రం...ఈ స‌మ్మెకు మ‌ద్ద‌తు తెల‌ప‌లేదు. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే...త‌న వైఖ‌రిని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్న విష‌యం సుస్ప‌ష్టం అయిన‌ప్ప‌టికీ... స‌మ్మెకు మ‌ద్ద‌తు/ స‌మ్మెను త‌ప్పుప‌ట్ట‌డం వంటి ఏదో ఒక నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 


మ‌రోవైపు, ఆర్టీసీ స‌మ్మెకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ స్ప‌ష్టంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. జ‌న‌సేన నేత‌లు మీడియాతో మాట్లాడుతూ..త‌మ అధినాయ‌కుడు ఎప్ప‌టికీ ప్ర‌జ‌ల ప‌క్ష‌మేన‌ని ప్ర‌క‌టించారు. దాదాపు 45 వేల మంది కార్మికుల‌ను రోడ్డున ప‌డేసే నిర్ణ‌యాన్ని ప‌వ‌న్ ఖండించార‌ని వెల్ల‌డించారు. పార్టీ అధినేత ప‌వ‌న్ స‌మ‌క్షంలో జ‌రిగిన‌ పొలిట్‌బ్యూరోలో కూడా...కేసీఆర్ తీరును త‌ప్పుప‌ట్టారు. కాగా, శ‌నివారం ఉదయం నుంచే ఆర్టీసీ బస్​ డిపోలు, బస్టాండ్ల వద్ద నిరసనలు, ధర్నాలు ఆర్టీసీ జేఏసీ ఆధ్వ‌ర్యంలో కార్మికులు చేస్తుండ‌గా....అన్ని పార్టీల ముఖ్య‌నేత‌లు భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ఇలాంటి త‌రుణంలో...హైద‌రాబాద్ న‌గ‌రంలోనే ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌...వాటిలో ఎక్క‌డా పాలుపంచుకోవ‌డం లేదు. దీంతో...ఈ ఇద్ద‌రు నేత‌ల వైఖ‌రిని ప‌లువురు ఆస‌క్తిక‌రంగా విశ్లేషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: