తెలంగాణ రాష్ట్ర బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో ప్రజల కష్టాలు మరింతగా పెరిగాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్టూడెంట్ యూనియన్లు, వామ పక్ష పార్టీలు పెద్ద ఎత్తున బంద్ లో పాల్గొన్నాయి. స్టూడెంట్ యూనియన్ల నిరసనలతో ఈ ప్రాంతమంతా మారుమ్రోగుతోంది. తమ్మినేని వీరభద్రం, విమలక్క, చెరుకు సుధాకర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారుల నిరసనలు, పోలీసుల అరెస్ట్ లతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
జేబీఎస్ దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వచ్చిన కోదండరాం, ఎల్.రమణ, మోత్కుపల్లిని పోలీసులు అడ్డుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైకోర్టు చెప్పిన విధంగా ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఎల్.రమణ అప్రకటిత ఎమర్జెన్సీ కనిపిస్తుందని ఫైర్ అయ్యారు. 
 
హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. డిపోల నుండి బస్సులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ కార్మికులు అడ్డుకుంటున్నారు. క్యాబ్ డ్రైవర్ల బంద్ తో ఎయిర్ పోర్ట్ నుండి రాకపోకలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. తెలంగాణకు వచ్చే ఆంధ్రప్రదేశ్ బస్సులు కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నిరసన తెలుపుతున్నారు. 
 
ప్రయాణికుల సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని బస్సులు రద్దు చేశామని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీలకు హాజరు కావటం లేదు. బంద్ నేపథ్యంలో హైదరాబాద్ బస్ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. బస్ భవన్ లోపలికి ఇతరులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: