సూర్యాపేట జిల్లాలో నిన్న విషాద ఘటన చోటు చేసుకుంది. చాకిరాల దగ్గర కారు గుంతను తప్పించబోయి అదుపు తప్పి సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ అంకుర్ ఆస్పత్రికి చెందిన ఆరుగురు సిబ్బంది ఈ కారు ప్రమాదంలో గల్లంతయ్యారు. సహోద్యోగి మహేశ్ వివాహానికి హాజరైన అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గల్లంతైన కారును ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాగర్ ఎడమ కాల్వలో గుర్తించారు. 
 
ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం అబ్ధుల్ అజీద్, జాన్సన్, రాజేశ్, పవన్ కుమార్, నగేశ్, సంతోష్ కుమార్ ఈ ప్రమాదంలో గల్లంతయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన గురించి తెలిసిన జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, కోదాడ ఆర్డీవో కిషోర్ కుమార్, కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, ఎస్పీ భాస్కరన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కాలువ ఉధృతంగా ప్రవహించటం వలన సహాయక చర్యలు కొంత ఆలస్యంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. 
 
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రమాదస్థలానికి 250 మీటర్ల దూరంలో కారును గుర్తించి బయటకు తీయటం కొరకు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఆరుగురు గల్లంతు కాగా మరో కారులో వెళుతున్న వారు కారు ప్రమాదాన్ని గుర్తించి స్థానికులకు సమాచారం అందించారు. రాత్రి సమయం కావటంతో నిన్న సహాయక చర్యలు చేపట్టాలని ప్రయత్నించినప్పటికీ సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. 
 
ఈరోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాల్వ లోతు 18 అడుగుల లోతు వరకు ఉందని తెలుస్తోంది. పెళ్లి ముచ్చటలు చెప్పుకుంటూ ఎంతో సంతోషంగా ముందుకు సాగిన వారు నిమిషాల వ్యవధిలో వాహనం అదుపుతప్పి గల్లంతయ్యారని మరో కారులో ప్రయాణిస్తున్న వీరి స్నేహితులు చెబుతున్నారు. కారు గల్లంతయిన వార్త తెలియటంతో గల్లంతయిన వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు సాయంత్రంలోపు కారు బయటకు తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: