ప్రస్తుతం తెలంగాణాలో ముఖ్య విషయం ఏమిటంటే తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌ లతో ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె పదహైదవ రోజు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వగా దీనికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కూడా మద్దతు పలికాయి. శనివారం ఉదయం నుంచే ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు తెలియచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్నీ డిపోల ఎదుట బైఠాయించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.


ఆర్టీసీ బంద్‌ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, వరంగల్ నల్గొండ జిల్లాల్లోని బస్సులు డిపోలకే పూర్తిగా పరిమితమయ్యాయి. డిపోల ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసు అధికారులు అరెస్టు చేశారు. బంద్‌ ప్రభావం హైదరాబాద్‌లో బాగా కనిపిస్తోంది. సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌, రాణిగంజ్‌, కంటోన్మెంట్‌ల్లోనూ బస్సులను డిపోల నుంచి అసలు కదలనివ్వకుండా కార్మికులు పూర్తిగా అడ్డుకున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌తో పాటు నగరంలోని ఆయా డిపోల ఎదుట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.


ఇది ఇలా ఉంటే బంద్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యంగా కార్మికుల మద్దతు తెలపడానికి వెళ్లిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌, టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి సహా పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని  లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌, పటాన్‌చెరులోని రాష్ట్ర కాంగ్రెస్ మహిళా కార్యదర్శి గోదావరి అంజిరెడ్డిని ఇదహరిని గృహనిర్బంధంలో ఉంచారు పోలీసులు. 


హైదరాబాద్‌ నగరంలోని బడంగ్‌పేట్‌లో బస్సు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇందిరా పార్క్ నుంచి బస్‌భవన్‌కు టీజేఎస్ నేతలు భారీ ర్యాలీగా బయలుదేరగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అలాగే సంగారెడ్డిలో కూడా బస్సులు డిపోలకే పరిమితం కాగా, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరయ్యేందుకు ముందుకు రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: