పరీక్ష కేంద్రాలలో చాలా మంది విద్యార్థులు పరీక్షలను సొంతంగానే రాస్తారు. కొందరు మాత్రం పరీక్షలలో కాపీ కొడుతూ ఉంటారు. అలా తమ యూనివర్సిటీలో ఒక్క విద్యార్థి కూడా కాపీ కొట్టకూడదని కర్ణాటకకు చెందిన ఒక యూనివర్సిటీ వింత ప్రయోగం చేసింది. ఆ వింత ప్రయోగం వలన ఇప్పుడు ఆ యూనివర్సిటీ పేరు దేశమంతటా మారుమ్రోగిపోతుంది. కర్ణాటకలోని భగత్ ప్రీ యూనివర్సిటీ విద్యార్థుల తలకు అట్టెపెట్టెలు తొడిగించి పరీక్షలు రాయించారు. 
 
ఈ యూనివర్సిటీలోని ఇన్విజిలేటర్లు  విద్యార్థులకు అట్టెపెట్టెలతో పరీక్షలు రాయించి  చుక్కలు చూపించారు. ఈ అట్టపెట్టెల వలన కొందరు విద్యార్థులు ఊపిరాడక ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. ఈ తప్పును యూనివర్సిటీ యాజమాన్యం సమర్థించుకుంటూ ఉండటం విస్మయం కలిగిస్తోంది. కళ్లు మాత్రమే కనిపించేలా అట్టపెట్టెలకు రంధ్రాలు చేసి యాజమాన్యం పరీక్షలు రాయించటంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారని సమాచారం. 
 
రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగగా ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. కర్ణాటక రాష్ట్ర విద్యా శాఖకు ఈ విషయం తెలియటంతో విద్యాశాఖ వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. కర్ణాటక విద్యాశాఖ మంత్రి ఎన్ సురేశ్ ఈ ఘటన గురించి స్పందించారు. సురేశ్ మాట్లాడుతూ ఇలాంటి చర్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. జంతువుల మాదిరిగా విద్యార్థులను చూస్తున్నారని అన్నారు. 
 
విద్యార్థులతో ఈ విధంగా వ్యవహరించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని సురేశ్ పేర్కొన్నారు. కాలేజీ హెడ్ సతీష్ మాత్రం బీహార్ లోని ఒక కాలేజీ ఇలాగే చేసిందని పరీక్షల్లో మోసాలు జరగకుండా ఉండాలంటే ఈ విధంగా చేయాలని సమర్థించుకోవటం గమనార్హం. మెక్సీకోలో ఇన్విజిలేటర్ ఒకరు ఇదే విధంగా చేస్తే విద్యార్థుల తల్లిదండ్రులు ఇన్విజిలేటర్ ను తొలగించే వరకు ఆందోళన చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: