ప్రజాధనం వృథా పేరుతో కోర్టుకు వెళ్లకుండా జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్‌ సొంత కేసులే కాబట్టి ఖర్చు కూడా తనే భరించాలని అయన అన్నారు. అవినీతి కేసుల్లో సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం మరింత పెరిగిందని యనమల విమర్శించారు. సహ నిందితులు, సాక్షులకు ఉన్నత పదవులు కట్టబెట్టడమే ప్రత్యక్ష సాక్ష్యమని యనమల విమర్శించారు.  ఇలాంటి పదవులు కట్టబెట్టినపుడు ఎందుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారని అంటున్నారు. రాజకీయనేతలపైనే కాదు.. మీడియాపై కూడా జగన్‌ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని యనమల ఆరోపించారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్వాకాల కారణంగానే నీతి ఆయోగ్‌ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ పదో స్థానానికి పడిపోయిందని జగన్‌ మొండి వైఖరి, తప్పుడు నిర్ణయాలు, అవినీతి, అసమర్థత కారణంగానే ఈ దుస్థితి వచ్చిందని యనమల ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘పెట్టుబడుల ఆకర్షణలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్ర అట్టడుగుకు దిగజారింది. కర్ణాటక నంబర్‌వన్‌ స్థానానికి చేరుకుంది.. పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా లేరని యనమల పేర్కొన్నారు.  ప్రభుత్వ ఉగ్రవాదం తట్టుకోలేక పోతున్నామన్న వ్యాఖ్యలే అందుకు రుజువని యనమల తెలిపారు.  


తెలుగుదేశం పాలనలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో ఆంధ్ర నంబర్‌వన్‌ ర్యాంకు సాధించింది. వాణిజ్యంలో, పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ముందున్నాం. కానీ జగన్‌ పాలనలో రాష్ట్రాన్ని అప్రతిష్ఠ పాల్జేశారు. పీపీఏల సమీక్ష పేరుతో బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగారు. ప్రైవేటు పెట్టుబడులు రావడం లేదు. పరిశ్రమలు పడకేశాయి. ఇసుక కొరతతో ఇళ్లు, భవనాలు, రోడ్లు, ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయి. జగన్‌ పాలన రాష్ట్రాన్ని ఆర్థిక అత్యవసర పరిస్థితిలోకి నెడుతోందని యనమల వైఎస్ జగన్ ను దుయ్యబట్టారు.  ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ అధికారం అడ్డుపెట్టుకొని కేసులను ప్రభావితం చేసే ప్రభావం ఎక్కువగా ఉందని, గతం కంటే ఇప్పుడు రెట్టింపు అవుతుందని అన్నారు.  చట్టం ముందు అందరూ సమానులే అని, గతంలో శిబుసొరేన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయన కోర్టుకు హాజరయ్యారని యనమల గుర్తు చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: