విజయవాడ  రాజధానికి దగ్గరలో ఉన్న పట్టణం కావడంతో, ఉపాధికోసం జనాభా ఈ నగరానికి భారీగా పెరిగారు,  ఒకప్పుడు 10 లక్షలు ఉన్న జనాభా ప్రస్తుతం 17 లక్షలకు చేకుందని అంచనా. జనాభాతో పాటు వాహనాల సంఖ్య సైతం రెట్టింపు అయినది.  ప్రధాన రహదారుల్లో ఉన్న వాణిజ్య భవనాల్లో 90 శాతం వాటికి పార్కింగ్‌ సౌకర్యాలు లేవు. విజయవాడ నగరంలోని చాల కాంప్లెక్స్‌ల్లో పార్కింగ్‌ సదుపాయాలు లేవు.  కొన్ని చోట్ల వాహనాలను రహదారులపైనే పార్కింగ్‌ చేయాలని కోరుతుండటం గమనార్హం.

మరికొన్ని చోట్ల పార్కింగ్‌ ఫీజులు అధిక మొత్తంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ల యాజమాన్యాలు వసూలు చేస్తుండటంతో వాహనదారులు రోడ్లపైనే తమ వాహనాలను పార్కింగ్‌ చేస్తున్నారు.  విజయవాడలో వాహనదారులకు పార్కింగ్‌ పెద్ద సమస్యగా మారింది. సరైన పార్కింగ్‌ స్థలాలు లేకపోవడంతో బిజీగా ఉన్న రోడ్లకు ఇరువైపులా పార్కింగ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలోని మహాత్మాగాంధీ రోడ్, కార్ల్‌మార్క్స్‌ రోడ్, కాంగ్రెస్‌ ఆఫీస్‌ రోడ్, టికిల్‌ రోడ్‌ సహా ప్రధాన రహదారులు ప్రతిరోజూ రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా గవర్నర్‌పేట, బీసెంట్‌ రోడ్, నక్కల్‌ రోడ్, సూర్యారావుపేట, కస్తూరీబాయ్‌పేటతోపాటు ఇతర వాణిజ్య ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది.

రోడ్డుకు ఇరువైపులా అనధికార పార్కింగ్‌ వల్ల పాదాచారులు సైతం రహదారులపై నడవలేని దుస్థితి ఏర్పడింది. నగరంలో విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు చిత్తూరి కాంప్లెక్స్, కాళేశ్వరరావు మార్కెట్, ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌ల్లో స్మార్ట్‌ పార్కింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే ఎంజీ రోడ్డు, ఏలూరు రోడ్డుల్లోనూ అలాంటి పార్కింగ్‌ కేంద్రాలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పటికీ  మరి తరువాత దానిని విస్మరించింది. నగరంలో బహుళ అంతస్తుల పార్కింగ్‌ సముదాయాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను అధికారులు అటకెక్కించడంతో అవి కలగానే మిగిలిపోయాయి. కృష్ణా జిల్లా రహదారి భద్రతా సలహా కమిటీ నగరంలో పార్కింగ్‌ సమస్యపై దృష్టి సారించింది.

నగరంలో వాణిజ్య ప్రాంతాల్లో పార్కింగ్‌ సముదాయాలను నిర్మించాలని వీఎంసీ అధికారులకు సూచించింది. ఇదీ ప్రతిపాదనగానే మిగిలిపోయింది.వీధుల్లో అనధికార పార్కింగ్‌పై చర్యలు తీసుకోవడంలో ట్రాఫిక్‌ పోలీసులు విఫలమయ్యారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అనధికారికంగా పార్కింగ్‌ చేసిన వాహనదారులపై 16వేల కేసులు నమోదు చేశారు. అయినా నేటికీ ప్రధాన రహదారులు, జంక్షన్లలో వాహనాల పార్కింగ్‌ కొనసాగుతూనే ఉంది.  నగరంలో ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకొని బీసెంట్‌ రోడ్డు, వన్‌టౌన్‌ ప్రాంతాల్లో నిర్మించాలని నిర్ణయించాం. అయితే వన్‌టౌన్‌ ప్రాంతంలో వీఎంసీకి చెందిన స్థలం లేదు. ప్రైవేటు భూమి సేకరించాల్సి ఉంది. బీసెంట్‌ రోడ్డులో నిర్మించే భవనానికి దాదాపు రూ. 5 కోట్లకు పైగా వ్యయం అవుతుంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నాం. ప్రభుత్వ ఆమోదించి ప్రత్యేక నిధులు విడుదల చేస్తే వాటి నిర్మాణాలు మొదలు పెడతాం అని ప్రసన్న వెంకటేష్, కమిషనర్, వీఎంసీ  తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: