తీరప్రాంతానికి ఉగ్రవాదుల నుంచి భారీ ముప్పు పొంచి ఉందా. సముద్రమే శత్రువులకు మంచి రక్షణను  ఇచ్చే స్థావరం అవుతోందా. నాటు పడవలే గమ్యానికి చేర్చే సాధనాలు అవుతున్నాయా. అందమైన పర్యాటక ప్రదేశాలే తుపాకీ గొట్టానికి టార్గెట్ అవుతున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అంటున్నాయి. భారత్ నష్టపోయినంతగా ఏ దేశం ఉగ్ర భూతానికి ఇప్పటివరకూ నష్టపోలేదు, కష్టపడలేదు. 


ఇదిలా ఉండగా ముంబై తరహా దాడులకు ఉగ్రవాదులు స్కెచ్ వేస్తున్నారన్న సమాచారం ఇపుడు దడ పుట్టిస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంత నగరాలనే లక్ష్యంగా  చేసుకుంటారని అంటున్నారు. అటు ముంబై నుంచి ఇటు విశాఖపట్నం, చెన్నై వరకూ కూడా తీరప్రాంతంలో అద్భుతమైన నగరాలు ఉన్నాయి. మరి వాటి రక్షణ ఇపుడు పెద్ద సవాల్ గా మారుతోంది.  ఈ నేపధ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఆధారంగా  తీరప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు సెంట్రల్  మెరైన్  పోలీస్ ఫోర్స్  ఏర్పాటు  చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.


దీనికి సంబంధించిన  విధివిధానాలను కేంద్ర  హోం శాఖ  ఇప్పటికే  రూపొందించారు. వచ్చే నెలలో  క్యాబినెట్  ముందు ప్రతిపాదనలు పెట్టనుంది.  ఉగ్రవాదులు భారత్ పై  దాడి చేసేందుకు సముద్ర మార్గం ద్వారా చొరబడుతున్నారు. దీంతో తీర ప్రాంత భద్రత కోసం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏది ఎలాగున్నా ఇప్పటికే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, దాయాది పాక్ తో ఘర్షణ వాతావరణం నేపధ్యంలో తీర ప్రాంతాల్లో అలెర్ట్ ప్రకటిస్తున్నారు. రానున్న రోజుల్లో గస్తీ ముమ్మరం చేయడం ద్వారా మరింత కట్టుదిట్టమైన చర్యలు చేప‌డతారు. అంతే కాకుండా ఎక్కడికక్కడ గట్టి బందోబస్తు కూడా చేపడతారు. తీరం వెంబడి అభివ్రుధ్ధి చెందిన నగరాలు ఉండడంతో అక్కడ రక్షణ కోసం ఆధునాతన ఏర్పాట్లు చేసేందుకు కూడా సిధ్ధపడుతున్నట్లుగా సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: