ప్రభుత్వంలో వివిధ శాఖలు, కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతిలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు ప్రభుత్వ వర్గాల్లో ఇపుడు చర్చనీయాంశం అయింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జారీ చేసిన జీఓ నెంబర్ 2323 రూపకల్పనలో పైనున్న ఉన్నతాధికారులకు కూడా తగు విధమైన సమాచారం లేదని అంటున్నారు.  ఈ జీఓ అమలులోకి వస్తే  ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇటీవల నియమితులైన అజయ్ కల్లాం తో సహా పలువురు సలహాదారులు, అధికారులు ఉద్యోగాలకు కూడా ఎసరు పడేలా ఉందని అంటున్నారు. గ్రామ స్థాయి వరకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు.


ఈ జీఓ కానీ అమలులోకి వస్తే వేలాది కుటుంబాలపై ప్రభావం పది రోడ్డున పడనున్నారు. ప్రభుత్వం ఏమాత్రం ముందు చూపులేకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఔట్ సోర్సింగ్ ఏజన్సీల ద్వారా గతంలో నియమితులైన ఉద్యోగుల ప్రస్తావన కొత్తగా ఏర్పాటైన జీవోలో ఎక్కడా లేకపోగా , 2323 జీవోలో మాత్రం 2019 మార్చి 31నాటికి రోల్స్ లో ఉన్న ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తొలగించాలని పేర్కొనడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామ, సచివాలయాల్ని ఏర్పాటు చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగాల్ని కల్పించామని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్తూ తాజాగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించడం అన్యామని అంటున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే కార్పొరేషన్ లో ఇప్పటికే పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్ని  అబ్జార్బ్ చేస్తారని భావించారు.



తాజా జీవోలో అటువంటి ప్రస్తావనేదీ లేకపోవడంతో వారి భవితవ్యం అగమ్యగోచరంగా కనిపిస్తోంది. 40 వేల రూపాయల పైబడి జీతం తీసుకుంటున్నవారికి ఉద్వాసన పలకాలని ఆదేశించడంతో ఆయా ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. 2323 జీవోలో కొన్ని మార్పులు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారు. ఔట్ సోర్సింగ్  కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఒక పక్క విధాన పరమైన నిర్ణయం తీసుకున్న వెంటనే తగు ఉత్తర్వులు జరీ చేయడంలో కూడా స్పష్టత లేదన్న చర్చ జరుగుతోంది. ఈ ఏడాది మార్చి 31 వ తేదీ నుంచి ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుందని జీవోలో పేర్కొనడం గమనార్హం. అయితే పత్రిక ప్రకటన ద్వారా కానీ, నిర్దిష్ట నియామక విధానం కానీ లేకుండా జరిగిన పోస్టింగులు కూడా చెల్లవన్నట్టు ఈ ఉత్తర్వులు పేర్కొనడం, ఇప్పటికే నియమితులైన అనేక మంది అధికారుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నర్థకంగా మారింది. కలకలం రేపుతున్న ఈ ఉత్తర్వులు పాలనాపరంగా ఎటువంటి పరిస్థితికి దారి తీస్తాయో అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: