అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ ఫార్మా సూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ గురించి షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి. వాషింగ్టన్ లో ఆన్ లైన్ లో కొన్న జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ బాటిళ్లలో ఆస్ బెస్టాస్ ఉన్నట్లు అమెరికా హెల్త్ రెగ్యులేటరీ కమిటీ గుర్తించింది. హెల్త్ రెగ్యులేటర్ కమిటీ క్యాన్సర్ కు కారణమయ్యే ఆస్ బెస్టాస్ అవశేషాలు ఉన్నట్లు చెప్పటంతో కంపెనీ 33 వేల బేబీ పౌడర్ బాటిళ్లను రీకాల్ చేస్తోందని తెలుస్తోంది. 
 
జాన్సన్ అండ్ జాన్సన్ గురించి ఇలాంటి వార్తలు బయటకు రావటంతో కంపెనీ షేర్లు కూడా 6 శాతానికి పైగా పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు 127.70 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. తొలిసారి అమెరికా హెల్త్ రెగ్యులేటరీ కమిటీ జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ లో ఆస్ బెస్టాస్ ఉన్నట్లు ప్రకటన చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఇప్పటికే పలు ఉత్పత్తుల విషయంలో వివాదాలను ఎదుర్కొంటుంది. 
 
కంపెనీ కూడా మొదటిసారి బేబీ పౌడర్ ఉత్పత్తులను అమెరికాలో వెనక్కు తీసుకుంటోంది. జాన్సన్ అండ్ జాన్సన్ ఎక్కువగా బేబీ పౌడర్ విషయంలో మొదటినుండి వివాదాలను ఎదుర్కొంటోంది. జాన్సన్ అండ్ జాన్సన్ రకరకాల ఉత్పత్తులతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ బేబీ పౌడర్ విషయంలో మాత్రం వివాదాలు తప్పటం లేదు. గతంలో కొందరు ఈ పౌడర్ వలనే క్యాన్సర్ సోకిందని కోర్టును కూడా ఆశ్రయించారు. 
 
గతంలో జాన్సన్ కంపెనీ ప్రతినిధి కరోల్ గ్రూడిచ్ తమ ఉత్పత్తుల కారణంగా క్యాన్సర్ సోకిందని చెప్పటానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పాడు. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ వాడటం వలన క్యాన్సర్ సోకిందని ఇప్పటివరకు వేల సంఖ్యలో ఫిర్యాదులు దాఖలు అయ్యాయని తెలుస్తోంది. కొన్ని ఫిర్యాదుల విషయంలో కోర్టు కంపెనీకి జరిమానాలు కూడా విధించింది. 




మరింత సమాచారం తెలుసుకోండి: