టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అయితే అది తన లేటెస్టు సినిమా ముచ్చట్లతో కాదు.. ఏకంగా ప్రధాన మంత్రి మోడీకి లేఖ రాయడం ద్వారా ఆయన షాక్ ఇచ్చారు. ఇటీవల మోడీ తరచూ ప్లాస్టిక్ వాడకంపై ప్రజలకు క్లాసు పీకుతున్న సంగతి తెలిసిందే. మొన్న చైనా అధ్యక్షుడితో మహాబలిపురం చర్చల సమయంలోనూ మోడీ బీచ్ లో ప్లాస్టిక్ ఏరుతూ ఆ వీడియోను పోస్టు చేశారు.


భారత్‌ను ప్లాస్టిక్‌ రహిత దేశంగా మార్చాలని.. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని నరేంద్ర మోదీ తరచూ పిలుపు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ మోడీకి లెటర్ రాశారు. వాతవరణంలో వస్తున్న మార్పులకు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఒక్కటే కారణం కాదని ఆ లేఖలో తెలిపారు. అందుకు చాలా కారణాలు ఉన్నాయన్నారు.


పూరీ జగన్నాథ్ ప్రధానికి రాసిన లేఖను సోషల్‌మీడియాతో పంచుకున్నారు. ఆ లేఖలో పూరీ జగన్నాథ్ ఏం రాశారంటే..

‘‘ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య వాతావరణ మార్పు. దీనికి చాలా కారణాలున్నాయి. అందులో ప్లాస్టిక్‌ కూడా ఒక కారణం. కేవలం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించినంత మాత్రాన పర్యావరణం బాగుపడదు. ప్లాస్టిక్‌ను ఒక్కసారి వాడిన తర్వాత దానిని ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల అది పర్యావరణానికి హానికారకంగా తయారవుతోంది. అయితే, ప్లాస్టిక్‌ను నిషేధించి పేపర్‌ బ్యాగుల వాడకం మొదలుపెట్టడం వల్ల చెట్లను నరికే పరిస్థితి వస్తుంది. దీనివల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతినే ప్రమాదముంది.


వాతావరణ మార్పుల నుంచి మనం బయటపడాలంటే మొక్కలను ఎక్కువగా నాటాలి. భూమి మీద జనాభా పెరగడం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను గురించి అందరికీ అవగాహన కల్పించాలి. ఒక్కసారి వాడిన ప్లాస్టిక్‌నే మళ్లీ, మళ్లీ వాడేలా చర్యలు తీసుకోవాలి. దీనిని గురించి ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి.


ఇందుకోసం ప్రభుత్వం ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌లను ఏర్పాటు చేసి ఒక్కసారి వాడిన ప్లాస్టిక్‌ను తీసుకువచ్చి ఇస్తే డబ్బులు ఇస్తామని ప్రకటిస్తే.. ప్రజలు వాడిన ప్లాస్టిక్‌ కవర్లను ఎక్కడపడితే అక్కడ పడేయ్యకుండా తీసుకువచ్చి ఆ కేంద్రాల్లో ఇస్తారు. ఇలాంటివి చేసినట్లు అయితే పర్యావరణాన్ని ప్లాస్లిక్‌ నుంచి కొంత వరకు కాపాడుకోవచ్చు.’ అని పూరీ తన లేఖలో చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: