ప్రభుత్వం ప్రజాధనాన్ని పరిరక్షకుడిగా ధర్మ కర్తగా ఉండాలి. ఏ ఒక్క రూపాయి మిగిల్చినా అది మరో పథకానికి ఉపయోగపడుతుంది. ఏపీ సీఎం జగన్ అదే చేస్తున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్ సర్కారు ఇప్పటికే దాదాపు 900 కోట్లు మిగిల్చిందంటే ఇది చిన్న విషయం కాదు. ఇంతకీ ఈ 900 కోట్లు ఎలా ఆదా అయ్యాయో పరిశీలిద్దాం..


వెలిగొండ రెండో సొరంగం పనులను 2006–07లో హెచ్‌సీసీ–సీపీపీఎల్‌ సంస్థ రూ.735.21 కోట్లకు దక్కించుకుంది. 8,580 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం, 9.2 మీటర్ల వ్యాసంతో 18.787 కి.మీ.ల పొడవున సొరంగం తవ్వి 0.3 మీటర్ల మందంతో లైనింగ్‌ పనులను పొడిగించిన గడువు ప్రకారం 2020 మార్చి నాటికి ఆ సంస్థ పూర్తి చేయాలి.


కానీ ఆ సంస్థపై గతేడాది ఆగస్టులో 60 సీ కింద వేటు వేశారు. అప్పటికి 10.750 కి.మీ.ల పనులను పూర్తి చేయగా రూ.489 కోట్ల బిల్లులు చెల్లించారు. అంటే రూ.246.21 కోట్ల పనులు మిగిలాయి. కానీ 60 సీ కింద తొలగించినప్పుడు ఆ పనుల విలువను రూ.299.48 కోట్లుగా తప్పుగా లెక్కించారు. 2017–18 ధరల ప్రకారం ఆ పనుల విలువను రూ.720.26 కోట్లకు పెంచేశారు.


ఈ పనులకు రూ.570.58 కోట్ల అంచనాతో గతేడాది ఆగస్టులో టెండర్లు పిలిచిన చంద్రబాబు సర్కార్‌ రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 4.69 శాతం అధిక ధరకు అంటే రూ.597.35 కోట్లకు కట్టబెట్టి భారీ ఎత్తున లబ్ధి చేకూర్చింది. ఆ సంస్థ ఇప్పటివరకూ 462 మీటర్ల పనులు మాత్రమే చేసింది. వాటి విలువ తీసివేయగా మిగిలిన పనుల విలువను రూ.553.13 కోట్లుగా లెక్కించారు.


ఇందులో 4.69 శాతం ఎక్సెస్‌ను తీసివేయగా వచ్చిన రూ. 528.35 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ముందుగానే రూ. 24.78 కోట్లు ఆదా అయ్యాయి. 528.35 కోట్ల అంచనా వ్యయంతో నిర్వహించిన టెండర్లలో 7 శాతం తక్కువ ధరకు అంటే రూ. 491.37 కోట్లకు మేఘా దక్కించుకుంది. దాంతో మొత్తమ్మీద 11.69 శాతం తక్కువ ధరకు పనులు అప్పగించినట్లయింది. దానివల్ల 61.76 కోట్లు ఆదా అయ్యాయి.


రివర్స్‌తో ఇప్పటివరకు రూ.903.09 కోట్లు ఆదా అయ్యాయి. పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం రివర్స్‌ టెండర్లలో రూ.782.80 కోట్లు మిగిలాయి. లెఫ్ట్‌ కనెక్టివిటీ (65వ ప్యాకేజీ ) పనులకు నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లో రూ.58.53 కోట్లు మిగిలాయి.వెలిగొండ రెండో టన్నెల్‌ మిగిలిన పనులకు నిర్వహించిన రివర్స్‌ టెండర్లలో రూ.61.76 కోట్లు మిగిలాయి. అంటే మొత్తం 900కోట్లు జగన్ ఏపీకి మిగిల్చారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: