వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై నెలలో ఈ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల కాగా సెప్టెంబర్ నెల మొదటి వారంలో పరీక్షలు నిర్వహించి మెరిట్ ఆధారంగా ప్రభుత్వం ఉద్యోగ నియమకాలను చేపట్టింది. ఎంపికైన వారు ప్రస్తుతం గ్రామ, వార్డ్ సచివాలయాల్లో విధుల్లో చేరి శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. 
 
గత కొన్ని రోజులుగా కడప జిల్లా కలెక్టర్ గ్రామ, వార్డ్ సచివాలయాలలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పోస్టులలో సున్నా మార్కులు వచ్చినా ఉద్యోగాలు ఇవ్వాలని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ తనపై వస్తున్న ఈ వార్తల గురించి స్పందించి స్పష్టత ఇచ్చాడు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల భర్తీ మెరిట్ ర్యాంకులు, రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే జరుగుతుందని కలెక్టర్ హరికిరణ్ చెప్పారు. 
 
కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ నోటిఫికేషన్ లో ఇచ్చిన ప్రకారం ఓసీలకు 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 45 మార్కులు అర్హత మార్కులుగా నిర్ణయించామని అన్నారు. మెరిట్ ర్యాంకుల ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరిగినప్పటికీ కొన్ని శాఖల్లో ఖాళీలు భర్తీ కాలేదని, ఈ ఖాళీల విషయంలో మాత్రం నోటిఫికేషన్ లోని పేరా 15.3 అనుసరించి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని అన్నారు. 
 
సున్నా మార్కులకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ జరుగుతుందని చెప్పటం కేవలం అపోహ మాత్రమేనని కలెక్టర్ చెప్పారు. 45 మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చినవారికి మెరిట్ రిజర్వేషన్ ర్యాంకుల ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. సున్నా మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామని అభ్యర్థులు భావించవద్దని కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ స్పష్టత ఇవ్వటంతో సున్నా మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉద్యోగాలు అనే వార్త నిజం కాదని స్పష్టం అయింది. 




మరింత సమాచారం తెలుసుకోండి: