చంద్రబాబునాయుడును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. చంద్రబాబు ఎంతో ఇష్టంగా ప్రోత్సహించిన నవయుగ కంపెనీకి పదేళ్ళ క్రితం కేటాయించిన వేలాది ఎకరాల భూ కేటాయింపులను తాజాగా రద్దు చేస్తు నిర్ణయించింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నవయుగ కంపెనీకి తగిలిన మూడో దెబ్బగా చెప్పుకోవాలి.

 

2009-2010 కాలంలో నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు దగ్గరలో అప్పటి ప్రభుత్వం 4731 ఎకరాలు కేటాయించింది. మల్టి ప్రొడక్ట్ సెజ్ ఏర్పాటు చేసి వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తానన్న కంపెనీ హామీ మేరకు వేలాది ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అయితే భూములు తీసుకుని పదేళ్ళయినా ఇప్పటి వరకూ కనీసం ఒక్క ఇటుక కూడా వేయలేదు. 

 

నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్  ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించింది. వెంటనే వేల ఎకరాల కేటాయింపులను రద్దు చేస్తు నిర్ణయం తీసుకుంది. విచిత్రమేమిటంటే చెప్పినట్లు సెజ్ ఏర్పాటు చేయకపోగా అదే భూమిని ఏపిఐఐసి అనుమతి లేకుండానే సుమారు రూ. 1900 కోట్లకు తాకట్టు పెట్టేసింది.

 

అంటే భూములు తీసుకున్నదే తాకట్టుపెట్టి వేలకోట్ల రూపాయలు అప్పులు తీసుకోవటానికే అన్న విషయం అర్ధమైపోతోంది. పైగా తీసుకున్న భూమిలోనే ఒక్క ఇటుక కూడా వేయని కంపెనీ మరో 6 వేల ఎకరాల భూమి కావాలని దరఖాస్తు చేసుకోవటమే విచిత్రం. కంపెనీ పెట్టుకున్న తాజా దరఖాస్తుతోనే మొత్తం తీగ కదలి డొంకంతా బయటపడింది.

 

ఇప్పటికే బందరు పోర్టు కాంట్రాక్టును కూడా నవయుగ కంపెనీకి రద్దు చేసిన విషయం తెలసిందే. ఇక్కడ కూడా వందలాది ఎకరాలు తీసుకున్న కంపెనీ తొమ్మిదేళ్ళయినా పనులు మొదలుపెట్టలేదు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టుతో పాటు హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును కూడా వైసిపి ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.  నవయుగ కంపెనీ అధినేత రామోజీరావు వియ్యంకుడు కావటంతో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడయ్యారు. ఇపుడు వరసపెట్టి కాంట్రాక్టులు, భూముల కేటాయింపు రద్దు చేయటంతో చంద్రబాబు మీదే దెబ్బ పడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: