ఆర్టీసీ కార్మికుల  సమ్మె కొనసాగుతోన్న  నేపధ్యం లో విద్యాసంస్థలు పున ప్రారంభం కావడంతో , స్కూళ్ళు , కాలేజీలకు వెళ్లేందుకు  బస్సుల్లేక విద్యార్థులు అష్ట, కష్టాలు పడుతున్నారు . ఈనెల ఐదవ తేదీ అర్ధరాత్రి నుంచి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెల్సిందే . అప్పటికే విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించడం తో, వారిపై సమ్మె ప్రభావం లేకుండా పోయింది . దసరా సెలవులు ముగిసినప్పటికీ , ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండడం తో , సెలవుల్ని పొడగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది .


దసరా సెలవులు పొడిగించడం పట్ల  అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తడం తో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఆత్మరక్షణ లో పడిపోయింది . సెలవులను పొడగించడాన్ని సవాల్ చేస్తూ కొంతమంది వ్యక్తులు హైకోర్టు లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు .  ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా బస్సులు నడవకపోవడం వల్లే విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించినట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది . ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా బస్సులను నడుపుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెబుతున్నప్పటికి, క్షేత్రస్థాయి లో వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉందన్నది నిర్వివాదాంశం.


ఆర్టీసీ బస్సుల్లేక ప్రయాణికులు ప్రయివేట్ క్యాబ్ లు , ఆటోలు, మెట్రో ట్రైన్ ను ఆశ్రయిస్తున్నారు . సాధారణ రోజుల్లో కంటే సమ్మె కొనసాగుతున్న ఈ 17 రోజుల్లో మెట్రో లో ప్రయాణిస్తున్న నగర వాసుల సంఖ్య ను పరిశీలిస్తే,  ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయి లో పరిస్థితులకు పొంతన లేదన్నది స్పష్టం అవుతుంది . ఈ పరిస్థితుల్లో తిరిగి విద్యాసంస్థలు పున ప్రారంభం కావడం తో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటూ స్కూళ్ళు , కాలేజీలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది .


మరింత సమాచారం తెలుసుకోండి: