హరియాణా, మహారాష్ట్రలోని అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. హరియాణాలోని 90 స్థానాలకు, మహారాష్ట్రలోని 288 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. హరియాణాలో 75 వేల మంది పోలీసులను, మహారాష్ట్రలో 3 లక్షల మంది పోలీసులను అధికారులు మోహరించారు. 
 
సినీ ప్రముఖులు అమీర్ ఖాన్, కిరణ్ రావ్, రవి కిషన్, రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు హరియాణాలో 6.07, మహారాష్ట్రలో 5.29 శాతం పోలింగ్ నమోదైంది. కైతాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు రణదీప్ సుర్జేవాలా ఆయన భార్యతో కలిసి హరియాణాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
 
ట్రాక్టర్ లో కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ బూత్ కు చేరుకున్న దుష్యంత్ చౌతాలా సిర్సాలోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 4,400 మంది అభ్యర్థులు 288 స్థానాల నుండి పోటీ చేస్తున్నారు. ఆటో డ్రైవరు నాగేష్ మిశ్రా ఓటు వేసేందుకు ముంబై నగరంలోని పోలింగ్ కేంద్రానికి వెళితే ఎవరో ఓటు వేశారని ఆరోపణలు చేశారు. 
 
సాంకేతిక లోపం కారణంగా నాగ్ పూర్ నగరంలోని ఒక పోలింగ్ కేంద్రంలో 45 నిమిషాల సమయం పాటు పోలింగ్ నిలిచిపోయింది. మహారాష్ట్రలోని పూణే నగరంలోని శివాజీనగర్ పోలింగ్ కేంద్రంలో విద్యుత్ కోత ఉండటంతో మైనపు ఒత్తుల వెలుగులో పోలింగ్ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా 51 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలకు ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. భారత మాజీ టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి, అతని భార్య ప్రముఖ నటి లారా దత్తా ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: