ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ లో ఒక వస్తువు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ చేసిన వస్తువు బదులు మరొక వస్తువు డెలివరీ అయిన ఘటనల గురించి వింటునే ఉంటాం. హైదరాబాద్ లోని రిషబ్ బి అనే వ్యక్తి ఫిబ్రవరి 22వ తేదీ  ఆపిల్ వాచ్ సిరీస్ 1 ను ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాడు. ఈ వాచ్ కు 22,900 రూపాయలు రిషబ్ చెల్లించాడు. కానీ రిషబ్ కు ఆపిల్ వాచ్ కు బదులుగా మరొక వాచ్ డెలివరీ అయింది. 
 
రిషబ్ వాచ్ కోసం 22,900 రూపాయలు చెల్లించగా డెలివరీ అయిన వాచ్ ఖరీదు మాత్రం కేవలం 2,350 రూపాయలు మాత్రమే. ఈ విషయం గురించి రిషబ్ వెంటనే పేటీఎం కస్టమర్ కేర్ నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. పేటీఎంకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పేటీఎం నుండి రిషబ్ కు సరైన స్పందన రాలేదు. విసుగు చెందిన రిషబ్ వినియోగదారుల ఫోరం ను ఆశ్రయించి పేటీఎం కంపెనీ చేసిన మోసం గురించి ఫిర్యాదు చేశాడు. 
 
వినియోగదారుల ఫోరంలో రిషబ్ తనను పేటీఎం కంపెనీ మోసం చేసిందని ఫిర్యాదు చేయగా ఫోరం చివరకు రిషబ్ కు న్యాయం చేసింది. రిషబ్ చేసిన ఫిర్యాదు గురించి పూర్తిగా విచారణ జరిపిన వినియోగదారుల ఫోరం పేటీఎం కంపెనీ రిషబ్ కు 35 వేల రూపాయలు జరిమనాగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పేటీఎం సంస్థ వెంటనే సమస్యను కూడా పరిష్కరించాలని పేర్కొంది. 
 
ఆర్డర్ ఒకటి ఇస్తే మరొకటి డెలివరీ చేసిందున వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన సమయంలో పేటీఎం కంపెనీకు ప్రాముఖ్యత బాగా పెరిగింది. ప్రజలు డిజిటల్ చెల్లింపులపై ఆ సమయంలో ఎక్కువగా ఆధారపడటం, పేటీఎంకు పోటీనిచ్చే కంపెనీలు కూడా ఎక్కువ సంఖ్యలో లేకపోవటం పేటీఎం కంపెనీ ప్రాముఖ్యత పెరగటానికి కారణమైంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: