జగన్ మార్క్ పాలిట్రిక్స్ వేరు అంటారు. జగన్ ఏం చేసినా కూడా దానికి ఓ విధానం, ప్లాన్  ఉంటుందని అంటారు. ఆయన మాటల కంటే చేతలనే ఎక్కువగా  నమ్ముతారు. ప్రచార ఆర్భాటం ఆయనకు కూడని పని. అదే విధంగా ఫలితాలు  కూడా త్వరగా రావాలని  గట్టిగా కోరుకుంటారు. తాను ఎంతకైనా కష్టపడే స్వభావం జగన్ ది. అదే సమయంలో తనతో పాటు మంత్రులు కూడా కష్టపడాలని, అధికారులు కూడా అడుగులో అడుగు వేయాలని జగన్ ఆశిస్తున్నారు. నిజానికి ఏ ముఖ్యమంత్రి అయినా ఇదే కోరుకుంటారు. 


అయితే జగన్ పదిసార్లు చెప్పరు. పదే పదే వెంటపడరు. ఒకటికి రెండు సార్లు చెప్పడం, కాదూ కూడదంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడమే.  ఇదే జగన్ ఫంక్షనింగ్ స్టైల్. అపుడు లబోదిబోమన్నా కూడా కుదిరే వ్యవహారం కాదు, అరచి గీ పెట్టినా లాభం కూడా లేదు. మరి జగన్ ఇపుడు మంత్రులందరికీ తెలిసేలా ఓ గట్టి సంకేతం ఇచ్చారు. అదేంటి అంటే మూడు నెలలు తిరగకుండానే ఇంచార్జి మంత్రులను మొత్తం మార్చేశారు.


హఠాత్తుగా జరిగిన ఈ పరిణామం పరమార్ధం ఏంటని మంత్రులే తర్జన భర్జన పడుతున్నారు. ఇంచార్జి మంత్రులుగా చాలా మంది ఫెయిల్ అయ్యారని జగన్ భావిస్తున్నారు. తమకు అప్పగించిన బాధ్యతలను వారు సక్రమంగా జిల్లాలో నెరవేర్చలెదని కూడా జగన్ అనుకోవడం వల్లనే ఇలా భారీ మార్పులకు దిగిపోయారని అంటున్నారు. ఇంచార్జి మంత్రులందరూ దాదాపుగా స్థాన చలనం పొందారు. పైగా ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకతోటి సుచరిత, ఆళ్ళ నాని ఇంచార్జి జిల్లా మంత్రులుగా అవకాశం కోల్పోయారు. అదే సమయంలో కొత్తవారికి అవకాశం దక్కింది. అయితే ఈ ఇంచార్జి మంత్రులు కూడా సమర్ధంగా పనిచేయకపోతే మార్పు తప్పదని జగన్ హెచ్చరికలే పంపారని అంటున్నారు.


మరో వైపు ఇంచార్జి మంత్రుల విషయంలో జగన్  తీసుకున్న దూకుడు నిర్ణయం చూసి మంత్రులు సైతం షాక్ తింటున్నారు. పని తీరు మార్చుకోకపోతే మంత్రి పదవులు కూడా ఉండవన్న సంకేతాన్ని జగన్ ఇండైరెక్ట్ గా ఇచ్చేశారని అంటున్నారు. ఆ విధంగా  మంత్రులకు ఇది డేంజర్ బెల్స్ మోగిస్తోందని కూడా అంటున్నారు. ఇప్పటికే పాతిక మంది మంత్రులు ఉన్నా కూడా అందులో చాలా మంది పనితీరు పట్ల జగన్ అసంత్రుప్తిగా ఉంటున్నారని అంటున్నారు. మరి వారు కనుక మెరుగుపడకపోతే రెండున్నరేళ్ళ పాటు మంత్రిగా ఉండే అవకాశాన్ని కోల్పోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: