వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 144రోజులు అవుతున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేవి అవినాష్‌ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక కొరత వలన  దాదాపు 20లక్షల భవన కార్మికులు  ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వివరించారు.

 

ఇసుక కొరత వలన పనులు లేక భవన కార్మికులు వైసీపీ పాలనలో దొంగల్లాగా మారడం సిగ్గుచేటు అన్నారు. ఇసుక కొరత రాష్ట్రంలో ఉందని స్వయంగా వైసీపీ మంత్రులు చెప్పినా దున్నపోతుపై వర్షం పడినట్లు ముఖ్యమంత్రి తీరు ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీలో యాక్టివ్‌ నేతలపై అధికార పార్టీ తప్పుడు కేసులు పెడుతూ భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

 

తమ అసమర్థపాలన కప్పిపుచ్చుకునేందుకే మీడియాపై ఆంక్షలు విధిస్తోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై రూ.6లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు చేసిన వైసీపీ.. అధికారంలోకి వచ్చినా మాటలకు మాత్రమే పరిమితమైందని విమర్శించారు. రైతు భరోసా, వాహన మిత్ర ద్వారా రైతులను, ఆటో డ్రైవర్లను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వశాఖల్లో 10లక్షలకు పైగా ఖాళీలు ఉంటే ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేయని చేతకాని ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు. వైసీపీ పాలనలో జగన్మోహన్‌రెడ్డి బంధువులకు, సామాజిక వర్గం వారికి మాత్రమే న్యాయం జరుగుతోందని, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో  స్కిల్‌డెవలప్‌మెంట్‌ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగిందని.. ఈ ప్రభుత్వంలో అలాంటివి ఏమి చేయలేదని విమర్శించారు. వైసీపీ పాలన చూసిన రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓటు వేశామని బాధపడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒకసారి ప్రజలకు వద్దకు వచ్చి వారి సమస్యలు వినాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాలను తొలగిస్తూ.. రాష్ట్రాన్ని నిరుద్యోగాంధ్రప్రదేశ్‌గా మార్చిందన్నారు. 'నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటాను' అని అవినాష్‌ స్పష్టం చేశారు. ఈ నెల 24న టీడీపీ ఆధ్వర్యంలో ఇసుక కొరత విషయంలో దీక్షలు చేపడుతున్నట్లు తెలియజేశారు

 


మరింత సమాచారం తెలుసుకోండి: