ఎన్నికల్లో ఓటమి దెబ్బకు చాలామంది టీడీపీ నేతలు అడ్రెస్ గల్లంతైన విషయం తెలిసిందే. ఓటమి దెబ్బకు టీడీపీ నేతలు ఎక్కడకిక్కడే సైలెంట్ అయిపోయారు. ఇక మరికొందరు నేతలు టీడీపీలో ఉంటే కష్టమే అని భావించి వైసీపీ, బీజేపీల్లోకి వెళ్ళిపోయారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి అయిదు నెలలు అవుతున్నాయి. త్వరలోనే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికలు రానున్నాయి. అయినా సరే టీడీపీని బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధపరిచే ఆలోచనలో ఆయా నియోజకవర్గాల్లో నేతలు లేరు.


ఈ క్రమంలోనే రాజకీయ రాజధాని విజయవాడ నగరం టీడీపీ నేతలు కూడా పార్టీ గురించి పట్టించుకునే స్థితిలో కనబడటం లేదు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు వస్తే విజయవాడ కార్పొరేషన్ కూడా ఎన్నికలు జరుగతాయి. ఇక్కడ టీడీపీకి పట్టు ఉంది కాబట్టి...కొంచెం కష్టపడితే మంచి ఫలితాలే సాధిస్తారు. 2014లో విజయవాడ కార్పొరేషన్ ని టీడీపీనే కైవసం చేసుకుంది. అలాగే విజయవాడ పశ్చిమ మినహా, తూర్పు, సెంట్రల్, విజయవాడ ఎంపీలని టీడీపీనే కైవసం చేసుకుంది.


అటు విజయవాడ నగరం చుట్టుపక్కల ఉండే పెనమలూరు,గన్నవరం, మైలవరం నియోజకవర్గాలని కూడా టీడీపీనే గెలిచింది. కానీ మొన్న ఎన్నికల్లో విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్, గన్నవరంలో వల్లభనేని వంశీ గెలిచారు. అలాగే విజయవాడ ఎంపీగా కేశినేని నాని గెలిచాడు. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీలు నియోజకవర్గాల్లోనే పనులు చేసుకుంటున్నారు. అటు కేశినేని మొన్నటివరకు సొంత పార్టీపైనే విమర్శలు చేసి...ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.


ఇక సెంట్రల్లో ఓడిపోయిన బొండా ఉమా కాసేపు పార్టీలో యాక్టివ్ గా కనిపిస్తే, కాసేపు కనబడరు. అటు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అడ్రెస్ లేరు. ఇక మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాలో హడావిడి తప్ప, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం లేదు. అటు పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కంటికి కనిపించడం లేదు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసీపీ మీద విమర్శలు చేయడంలో బిజీగా ఉన్నారు.


యువనేత దేవినేని అవినాష్ కష్టపడుతున్న....సీనియర్లు ఆయనకు అడ్డం పడుతున్నారు. మొత్తం పరిస్థితులు చూసుకుంటే నగరంలో టీడీపీ ఇంకా కోలుకోలేదనే అనిపిస్తుంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా టీడీపీ ఘోర ఫలితాలని చవిచూడక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: