రాజ‌కీయాల్లో నాయ‌కులు ఎదిగేందుకు ఒక‌ప్పుడు ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకునేవారు. వారి ఆశీస్సుల‌తో బ‌ల‌మైన నాయకులుగా ఎదిగే వారు. అయితే, త‌ర్వాత త‌ర్వాత కాలం మారింది. పార్టీల అధినేత‌ల‌కు ప్రాధాన్యం పెరిగింది. ప్ర‌జ‌ల వ‌ల్ల ఎంత పేరున్నా.. ఎంత పేరు తెచ్చుకున్నా.. పార్టీల అధినేతల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటే త‌ప్ప త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్క‌వ‌నే నిర్ణ‌యానికి నాయ‌కులు వ‌చ్చేశారు. దీంతో అప్ప‌టి నుంచి నేత‌ల‌కు ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వ‌డం క‌న్నా.. అధినేత‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే అధినేత‌ల‌ను మెప్పించేందుకు శ‌త‌విధాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.


ఈ త‌ర‌హా ప‌రిణామం.. ఇత‌ర పార్టీల క‌న్నా కూడా టీడీపీలోనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. గ‌తంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న స‌మ యంలో అయితే.. నాయ‌కులు నిత్యం పార్టీ అధినేత చంద్ర‌బాబు భ‌జ‌న‌లో మునిగి తేలారు. నిత్యం బాబు నామ‌స్మ‌ర‌ణ‌లో, ఆయ‌న భ‌జ‌న సంకీర్త‌న‌లో కాలం గ‌డిపి.. ప‌ద‌వులు సొంతం చేసుకున్న నాయ‌కులు చాలా మందే ఉన్నారు. స‌రే! అప్ప‌ట్లో అంటే.. అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి ఆయ‌న‌ను పొగిడేందుకు ఒక రీజ‌న్ ఉంది. అయితే, ఇప్పుడు ప్ర‌జ‌ల ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో టీడీపీ ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మైంది. దీంతో ఇప్ప‌డు కూడా చంద్ర‌బాబును పొగిడేందుకు, జ‌గ‌న్‌ను తిట్టి పోసేందుకు నాయ‌కులు ప్రాధాన్యం ఇవ్వ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది.


రాష్ట్రంలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన ఐదు మాసాలు మాత్ర‌మే పూర్త‌యింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇది చాలా స్వ‌ల్ప స‌మ‌యం. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ త‌న పాల‌న‌లో మెరుపులు మెరిపిస్తున్నారు. ఆయ‌న ఎన్నిక‌ల‌కుముందు ఇచ్చిన న‌వ‌ర‌త్నాల హామీ మేర‌కు వాటిని అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప‌లు కీల‌క ప‌థ‌కాల‌ను తెర‌మీదికి తెచ్చారు. గ‌డిచిన నెల‌లో 2 ల‌క్ష‌ల పైచిలుకు వ‌లంటీర్ ఉద్యోగాల‌ను సృష్టించారు. అదేస‌మయంలో 1.46 ల‌క్ష‌ల స‌చివాల‌య కార్య‌ద‌ర్శుల ఉద్యోగాల‌ను సృష్టించారు. మొత్తంగా నిరుద్యోగుల‌కు ఉప‌శ‌మ‌నం క‌ల్పించారు. ఇక‌, తాజాగా రైతు భ‌రోసా కింద టీడీపీ అనుకూల మీడియా చెప్పిన దాని ప్ర‌కార‌మే 36 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ఢి చేకూర్చేలా 9500 చొప్పున నిధులు ఇచ్చారు. ఇక‌, పింఛ‌న్లు పెంచారు.


అయితే, ఇన్ని జ‌రుగుతున్నా కూడా టీడీపీలోని కొంద‌రు నాయ‌కులు మాత్రం ఇవేమీ త‌మ‌కు క‌నిపించ‌డం లేదు.. అన్న‌ట్టుగా జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైంది. లక్షలాది కార్మిక కుటుంబాల బాధలు వర్ణణాతీతం. ఆకలికి తట్టుకోలేక చోరీలకు పాల్పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. నిరుద్యోగులుకు పూర్తి స్థాయి న్యాయం జరగడంలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు.. అని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారంటే.. ఏమ‌నాలి వీరిని?  చిత్రం ఏంటంటే ఇలా విమ‌ర్శిస్తున్న వారిలో టీడీపీ మేధావి వ‌ర్గం కూడా ఉండ‌డంతో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు తిట్టి పోస్తున్నారు. ఇప్ప‌టికైనా ఆపండ‌య్యా మీబాబు డ‌బ్బా!! అంటూ దెప్పిపొడుస్తున్నారు. మ‌రి త‌మ్ముళ్లు మార‌తారా?  లేదా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: