ప్రజల రోజువారీ జీవనంలో సోషల్ మీడియా ఓ భాగమైపోయింది. పేపర్ కంటే టీవీల్లో త్వరగా వార్త తెలుస్తుందనుకుంటే దాని కంటే వేగంగా సోషల్ మీడియా వచ్చి చేరింది. ప్రజల చేతిలోని సెల్ ఫోన్స్ లో అత్యంత వేగంగా వార్తలు వచ్చేస్తున్నాయి. వార్తలు వస్తే పర్లేదు కానీ.. సోషల్ మీడియా విస్తృతి వల్ల విద్వేషాలు, తప్పుడు వార్తల ప్రచారం ఎక్కువై సమాజంలో అలజడులకు కారణమైపోతోంది. దీనిని నియంత్రించేందుకు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రణాళికలు లేకపోవటంతో ఇకపై సోషల్ మీడియా వ్యవస్థపై నియంత్రణ విధించేందుకు కేంద్రం సిద్దమవుతోంది.

 


రోజు రోజుకీ విస్తృతమవుతున్న సోషల్ మీడియాలో వార్తలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు ఎక్కువగా షేర్ అవుతున్నాయని కేంద్రం గుర్తించింది. దీన్ని గమనించిన కేంద్రం ఇప్పుడు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటోంది. వచ్చే మూడు నెలల్లో సామాజిక మాధ్యమాల విషయంలో సరికొత్త నిబంధనలు తీసుకురాబోతోంది. విద్వేషపూరిత వ్యాఖ్యలు, తప్పుడు వార్తల ప్రచారం ఎక్కువగా జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం అంటోంది. దీని వల్ల వ్యక్తుల హక్కులకు ముప్పు ఏర్పడుతోందని.. దీన్ని అరికట్టేందుకు నిబంధనలు కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆమధ్య జమ్ము కశ్మీర్ లో వాట్సప్ ద్వారా విద్వేషపూరిత వ్యాఖ్యలు షేర్ అయి అల్లర్లు జరిగాయని అక్కడ వాట్సప్ కూడా నిలిపివేశారు. దాంతో ఐదుగురి కంటే ఎక్కవ వ్యక్తులకు వార్త షేర్ కాకుండా మార్పులు కూడా చేశారు. అయినా పలు సామాజిక మాధ్యమాల ద్వారా సెల్ ఫోన్లలో షేర్ అవుతున్న కంటెంట్ పై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

 


ఇప్పటికే సోషల్ మీడియాలో ఎటువంటి వార్తలు షేర్ అవుతున్నాయనేదానిపై కేంద్రం నిఘా పెట్టినట్టు సమాచారం. రాబోయే కొత్త నిబంధనలతో ఇకపై సోషల్ మీడియాలో జరుగుతున్న వాదనలు, వ్యాఖ్యల తీవ్రత తగ్గుతుందేమో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: