గోదావరిలో దాదాపు నెల రోజుల క్రితం మునిగిపోయిన రాయల వశిష్ట బోటు ఇంకా బయటకు తీయలేదు. దీన్ని తీసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మొన్నటి వరకూ గోదావరిలో నీటి ప్రవాహం కారణంగా బోటు వెలికి తీయలేదు. ఇప్పుడు ప్రవాహం తగ్గడంతో మళ్లీ ప్రయత్నాలు జోరందుకున్నాయి.


ప్రవాహం తగ్గినా సాధారణ గజ ఈతగాళ్లు బోటును తీసేందుకు ముందుకు రాలేదు. బోటులో మృతదేహాలు ఉంటాయన్న కారణంతో వారు ముందుకురాలేదు. దీంతో ధర్మాడి సత్యం బృందం విశాఖ నుంచి స్కూబా డైవర్లును రప్పించింది. ఇప్పటికే బోటు రెయిలింగ్ బయటకు వచ్చింది. తాజాగా సోమవారం డైవర్లు నీటిలోకి దిగి.. బోటుకు లంగరు బిగించారు. ధర్మాడి సత్యం బృందం ఆరు గంటల పాటు కష్టపడి పై భాగాన్ని వెలికితీసింది.


నది ఒడ్డుకు 240 అడుగుల దూరంలో ఉన్న బోటును జేసీబీతో లాగేందుకు యత్నించారు. డీప్​ డైవర్లు నీటి లోపలికి ఏడుసార్లు దిగి ఉచ్చు బిగించారు. రోప్​ భారంగా రావడం వల్ల బోటు వస్తోందనే అంతా భావించారు. కానీ మొత్తానికి రోపు లాగి చూస్తే.. రాయల్ వశిష్ట టాపు మాత్రమే బయటకు వచ్చింది. దీంతో అంతా కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో మరోసారి వెలికితీత పనులు పనులు చేపట్టాల్సిఉంది.


వారం రోజులుగా గోదావరిలో నీటిమట్టం తగ్గుతుండడం వెలికితీత ప్రయత్నాలకు కాస్త అనుకూలించింది.. ప్రస్తుతం బోటు ఉన్న చోట నీటి మట్టం సుమారు 40 అడుగులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నం ఓం శివశక్తి అండర్‌వాటర్ సర్వీసెస్‌కు చెందిన ఇద్దరు డైవర్లు ఆదివారం ఉదయం నదిలో మునిగి బోటుకు భారీ తాళ్లు కట్టడంతో బోటు పైభాగం కొంత బయటకు లాగగలిగారు. బోటులో ఇసుక, మట్టి పెద్దమొత్తంలో పేరుకుపోవడంతో ఒకేసారి రాలేదని, పైభాగం ఊడి వచ్చిందని ధర్మాడి సత్యం తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: