తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతూనే ఉంది. సమ్మె విరమణకోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చివరకు కోర్టులు చెప్పినా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరో రెండు పిటీషన్లు దాఖలు అయ్యాయి.ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమ్మెకు దిగినప్పటికీ ప్రభుత్వం, కార్పొరేషన్ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.


దీంతో పాటు చట్ట విరుద్దంగా సమ్మెకు దిగిన కార్మికులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మరొక పిల్ దాఖలయ్యాయి. ఆర్టీసీ సమ్మె కారణంగా లక్షలాది ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్లలో పిటిషనర్లు కోరారు.అయితే ఆర్టీసీపై ఇప్పటికే పలు కేసుల్లో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల జీతాల గురించి మరో కేసు నడుస్తోంది. అందుకే ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్. ఎస్. చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇప్పటికే పెండింగ్ లో ఉన్నవాటితో కలిపి విచారణ చేపడతామని తెలిపింది.


ఈ కేసులను ఈనెల 28కి వాయిదా వేసింది. ఇదే సమయంలో ఆర్టీసీ కార్మికుల జీతాలపై వేసిన పిటిషన్‌లో ఆసక్తికరమైన వాదనలు సాగాయి. కార్మికులకు సెప్టెంబరు జీతాలు చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ టిఎన్‌ఎంయూ ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ అభినందకుమార్ షావలి విచారణ చేపట్టారు. కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బుల్లేవని కోర్టుకు తెలపడం విశేషం.


కార్పొరేషన్ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె. రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. కార్పొరేషన్ ఖాతాలో ప్రస్తుతం రూ.7.49 కోట్లు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఒక నెల వేతనాలు చెల్లించాలంటే రూ.230 కొట్లు అవసరమని చెప్పారు. పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ సెప్టెంబరు వేతనాలను చెల్లించలేదని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: