టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధాలు ముదురుతున్నాయి. వైసీపీ తరపున గెలిచిన 151 మందిని ఇటీవల ప్రతిపక్షనేత చంద్రబాబు మేకలతో పోల్చారు. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ చంద్రబాబు వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు.


ఆయన ఏమన్నారంటే.. 40 సంవత్సరాల అనుభవం, పొలిటికల్‌ ఇండస్ట్రీ అని చంద్రబాబు అంటాడు. అధికార పార్టీలో ఉన్న 151 ఎమ్మెల్యేలను మేకలతో పోల్చుతున్నాడు.. తెలుగుదేశంకి సంబంధించినవారు 23 మంది పులులు అని మాట్లాడుతున్నాడని, పులులు కాబట్టే ప్రజలు వారిని అరణ్యంలోకి పంపించారన్నారు. ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.


చంద్రబాబు ఆ విధమైన సంస్కారంతో పెరిగారేమో కాబట్టే ఆయన తనయుడు లోకేష్‌ బాబు మతిలేని వాడిగా గుర్తింపుపొందాడన్నారు. అందుకే మంగళగిరి ప్రజలు లోకేష్‌ను తిరస్కరించారని ఎద్దేవా చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ అటు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే.. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. అది చూసి చంద్రబాబుకు మింగుడుపడడం లేదన్నారు. స్థాయి దిగజారి మాటలు మాట్లాడుతున్నాడన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలని సూచించారు.


రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన సాగుతోందని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన వ్యవసాయ మిషన్‌ బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి మాసంలో ఈ వ్యవసాయ మిషన్‌ సమావేశమై.. రైతాంగ సమస్యలను అధిగమించేందుకు చర్యలు చేపడుతుందన్నారు. రైతును ఆదుకోవాలనే ఆలోచనతో పంటకు గిట్టుబాటు ధర అందించే విషయంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు. శనగ రైతులను ఆదుకున్నామని, మార్కెట్‌ యార్డుల్లో దళారీ వ్యవస్థను అరికట్టామని మంత్రి మోపిదేవి చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: