ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో భాగ్యనగరంలో ప్రజలు మెట్రో రైలును సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. అందుకే  ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన నాటి నుంచి మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. సమ్మె జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో అదనపు రైళ్లను నడుపుతోంది. గతంలో ప్రతి 7 నిమిషాలకు ఓ మెట్రో సర్వీసు ఉండగా.. ఈ సమయాన్ని సగానికి తగ్గించడం గమనార్హం. ఇకపోతే హైదరాబాద్‌ మెట్రో రైళ్లలో ప్రస్తుతం రోజూ సరాసరి 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారని అంచనా. వారానికి 5 వేల మంది ప్రయాణికులు పెరుగుతున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.


సాధారణంగా అమీర్‌పేట్ ఇంటర్ ఛేంజ్, ఉప్పల్, మాదాపూర్ లాంటి మెయిన్ స్టేషన్లలోనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన తర్వాత ఈ రద్దీ విపరీతంగా పెరిగి, ప్రయాణికులు మెట్రో రైళ్లలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. కార్యాలయాల పనివేళల్లో ఐతే ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటోంది. ఈ దశలో నిన్న అంటే (అక్టోబర్ 21)న హైదరాబాద్ మెట్రో రైలు సరి కొత్త రికార్టు సృష్టించింది. మెట్రో రైళ్లలో ఒక్క రోజే 4 లక్షల మందికి పైగా ప్రయాణించారు. మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇదే అత్యధికమని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి వెల్లడించారు.


ఆర్టీసీ సమ్మె ప్రభావంతో మెట్రో‌ రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అదనపు సర్వీసులను కూడా నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి 3.5 నిమిషాలకు ఒక రైలును నడుపుతున్నట్లు తెలిపారు. ఇకపోతే సోమవారం ఒక్క రోజే 830 ట్రిప్పులు నడిపినట్లు వెల్లడించారు. ఇదేగాకుండా గత నెలలో వినాయకచవితి సందర్భంగా కూడా హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డులు నమోదు చేసింది.


ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌ నుంచి ఒకే రోజు 70 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. బడా గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా వీరికి మెట్రో సరైన ప్రత్యామ్నాయంగా మారింది. బడా గణేష్ మండపం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌కు సమీపంగా ఉండటం కూడా కలిసొచ్చింది. మెట్రోలో వస్తే పార్కింగ్ తిప్పలు కూడా లేకపోవడం.. దీన్ని ప్రత్యామ్నాయ సాధనంగా వినియోగించుకోవడానికి మరో ప్రధాన కారణం....


మరింత సమాచారం తెలుసుకోండి: