పొరుగునే ఉన్న‌ప్ప‌టికీ..కుట్ర రాజ‌కీయాల‌కు పెట్టింది పేరుగా మారిన పాకిస్థాన్ త‌న బుద్ధిని ఎంత మాత్రం మార్చుకోవ‌డం లేదు. ఏ అంశంలో అయినా...త‌న‌దైన శైలిలో వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంటోంది. భారత్-పాకిస్థాన్ మధ్య పోస్టల్ సేవలను ఏకపక్షంగా నిలిపివేసింది. త‌ద్వారా దౌత్య సంబంధాల్లో త‌న మూర్ఖ‌పు వైఖ‌రిని చాటుకుంది. దీనికి కొన‌సాగింపుగా, కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను సందర్శించే యాత్రికులు 20 డాలర్ల (దాదాపు రూ.1,400) చొప్పున ఫీజు చెల్లించాలని ష‌రతు విధించింది. 


గురుద్వారా కర్తార్‌పూర్ సాహిబ్‌ను వీసా లేకుండా సందర్శించేందుకు వీలుకల్పించాలని దీర్ఘకాలం నుంచి యాత్రికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, దర్బార్ సాహిబ్ గురుద్వారాను సందర్శించే యాత్రికుల నుంచి 20 డాలర్ల ఫీజు వసూలు చేయాలని పాక్ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యంలో భార‌త్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. స‌ద‌రు ఆదేశాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోరింది. అయితే, పాకిస్థాన్ దానికి నో చెప్పింది. దీంతో..పాక్ మూర్ఖ‌పు ప్ర‌వ‌ర్త‌న గురించి తెలిసిన భార‌త్‌...త‌మ విజ్ఞప్తికి పాకిస్థాన్ అంగీకరించకపోయినప్పటికీ నవంబర్ 12వ తేదీకి ముందే ఆ కారిడార్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని ప్ర‌క‌టించింది. 


విదేశీ వ్యవహారాల శాఖ తాజాగా స్పందిస్తూ  కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను సందర్శించే యాత్రికులు 20 డాలర్లు చెల్లించాల‌నే నిర్ణ‌యం ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోరుతున్నామ‌ని, అదే స‌మ‌యంలో భ‌క్తుల కోసం గురుద్వారాను ప్రారంభించే ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఒప్పందంపై సంతకం చేసేందుకు భారత్ అంగీకరిస్తూనే..  నిర్ణయాన్ని పాక్ పునఃపరిశీలించాలని మరోసారి కోరినట్టు ఎంఈఏ తెలిపింది. మ‌రోవైపు, పోస్టల్ సేవ‌లు నిలిపివేయ‌డంపై భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమైనదని కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ విమర్శించారు. ఇలాంటి వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు ఇరుగుపొరుగు దేశాల మ‌ధ్య  సంబంధాలు బ‌ల‌హీన‌ప‌డేందుకు కార‌ణంగా మారుతాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: