నవ యుగ కలియుగ ప్రత్యక్ష దైవంగా తనకు తాను ప్రకటించుకున్న కల్కి భగవాన్ అలియాస్ విజయ్ కుమార్ ఆశ్రమాలు, ఆయనకు సంబంధించిన నివాసాల్లో ఐటీ దాడులు అన్ని చోట్ల ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సోమవారం కల్కీకి చెందిన వైట్ లోటస్‌ లో ఐటీ దాడులు జరిగాయి. ఐటీ దాడుల్లో గుట్టగుట్టలుగా నగదు, ఆభరణాలు బయట పడుతుండటం గమనార్హం.


వైట్ లోటస్‌ లో సుమారు రూ. 44 కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దేశంలోని 40 ప్రాంతాల్లో మూడు వందల మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం జరుగుతోంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, చిత్తూరు ఇంకా కొన్ని ప్రాంతాల్లో కల్కీకి చెందిన ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు జరుపుతున్నారు. 


గత ఐదు రోజులుగా ఐటీ అధికారులు జరుపుతున్న సోదాల్లో లెక్కల్లోకి రాని ఐదు వందల కోట్లను ఐటీ అధికారులు గుర్తించడం గమనార్హం. విదేశాల్లోనూ కల్కీకి భారీగా ఆస్తులు ఉన్నట్లు తేల్చారు అధికారులు. హవాలా వ్యాపారం ద్వారా ఎనభై కోట్ల రూపాయలు కల్కీ ఆశ్రమానికి వచ్చినట్లు ఐటీ అధికారులు లెక్కలు వేస్తున్నారు.
ఇప్పటికే అక్కడ తొంభై కిలోల బంగారం, ఆభరణాలు, గోల్డ్ బాక్సులు, కీలకమైన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు గుర్తించారు. గుట్టలుగా కరెన్సీ నోట్లు, బంగారు ఆభరణాలు లభ్యమవుతుండటంతో ఐటీ శాఖ అధికారులు కూడా షాకవుతున్నారు. ఇంత భారీస్థాయిలో కల్కీ ఆస్తులు ఎలా కూడబెట్టారనే విషయం పై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.


సేవా దృక్పథంతో స్థాపించిన సంస్థలో ఇంత భారీ ఆస్తులెలా వచ్చాయని విచారిస్తున్నారు అధికారులు. ఒక సాధారణ ఎల్ఐసీ ఏజెంట్‌గా జీవితాన్ని ప్రారంభించిన విజయ్ కుమార్, ఆ స్థాయి నుంచి కల్కి భగవాన్‌ గా మారి వేల కోట్ల ఆస్తులు, కిలోల కొద్ది బంగారం సంపాదించడంపై ఐటీ అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు.


కల్కి భగవాన్, భక్తుల నుంచి వచ్చిన సొమ్మును చైనా, అమెరికా, సింగపూర్, యూఏఈ ల్లోని పలు వ్యాపారాలు, కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టినట్లు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా బినామీ ఆస్తులు కూడా కల్కి భగవాన్ దగ్గర భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల్లోనే ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా లెక్కలేని ఆస్తులు బయటపడటంతో ఐటీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు అధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: