ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే 13 జిల్లాలను 25 జిల్లాలుగా పెంచుతానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజలు కూడా జిల్లాల సంఖ్య పెరిగితే అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రేటర్ రాయలసీమలో భాగమైన కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను 12 జిల్లాలుగా చేయాలన్న ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
చిత్తూరు జిల్లాను మూడు జిల్లాలుగా, కర్నూలు జిల్లాను మూడు జిల్లాలుగా, వైయస్సార్ కడప జిల్లాను రెండు జిల్లాలుగా, అనంతపూర్ జిల్లాను రెండు జిల్లాలుగా విభజించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రకాశం, నెల్లూరు జిల్లాలు మాత్రం యధావిధిగా ఉంటాయని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఎప్పటినుంచో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి కసరత్తు చేస్తోంది. 
 
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల ఆధారంగా మరియు స్థానిక జనాభా ఆధారంగా జిల్లాల విభజన ఉండబోతుందని సమాచారం. రాయలసీమ ప్రాంతానికి కొత్త రూపు తీసుకొనిరావాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం గ్రేటర్ రాయలసీమలోని 6 జిల్లాలను 12 జిల్లాలుగా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పరిషత్ ఎన్నికల కంటే ముందే కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలా ? లేక పరిషత్ ఎన్నికలు ముందుగా నిర్వహించాలా..? అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఎన్నికల కంటే ముందుగానే కొత్త జిల్లాల ఏర్పాటు అయ్యే అవకాశం ఐతే ఉందని తెలుస్తోంది. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికలు ముందుగా జరిగితే పార్లమెంటు నియోజకవర్గాలను ప్రాతిపదికగా చేసుకొని ఏర్పాటు అయ్యే కొత్త జిల్లాల పాలనలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం జిల్లాల పెంపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. రాష్ట్రంలోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా, గ్రేటర్ రాయలసీమలోని 6 జిల్లాలను 12 జిల్లాలుగా ప్రభుత్వం విభజించబోతుందని సమాచారం. 




మరింత సమాచారం తెలుసుకోండి: