ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు అన్న వార్త బెజవాడ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల తర్వాత తండ్రితో కలిసి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత నెహ్రూ ఆకస్మిక మృతితో అవినాష్ తెలుగు యువత అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసేందుకు సీటు ఆశించ‌గా... అక్కడ గద్దె రామ్మోహన్ ఉండడంతో చంద్రబాబు అవినాష్‌ను గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేయించారు.


అక్కడ పోటీ చేయడం ఇష్టం లేకున్నా చంద్రబాబు ఆదేశంతో పాటు.. బాబాయ్ దేవినేని ఉమా ఒత్తిడి మేరకు పోటీ చేయక తప్పలేదు. ఆ ఎన్నికల్లో అవినాష్ రు. 80 కోట్ల వరకు ఖర్చు చేసినా ఓటమి తప్పలేదు. వాస్తవానికి విజయవాడ తూర్పు, నూజివీడు, పెనమలూరు స్థానాల నుంచి పోటీ చేయాలని భావించారు. తనకు ఆ రెండు స్థానాలు తనకు దక్కకపోవడం వెనక సొంత మనుషుల కుట్ర ఉండటం కూడా అవినాష్ ను ఎంతో బాధించింది. ఇక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయాక తనకు ప్రయారిటీ తగ్గడంతో అవినాష్ సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.


ఇక తమ కుటుంబానికి చిరకాల రాజకీయ శత్రువుగా ఉన్న వంగవీటి రాధాను సైతం చంద్రబాబు ఎన్నికలకు ముందు పార్టీలో చేర్చుకున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా వేరువేరు పార్టీలో ఉంటూ బద్ధ శత్రువులుగా ఉంటున్న దేవినేని.. వంగవీటి కుటుంబాలు ఒక పార్టీలో ఉండటం అటు వంగవీటి అభిమానులతో పాటు ఇటు దేవినేని అభిమానులకు సైతం నచ్చలేదు. తాను ఉన్న పార్టీలోనే రాధ కూడా ఉండటం అవినాష్ కు సుతరామూ ఇష్టం లేదు. ఇక అవినాష్‌కు గుడివాడ పాలిటిక్స్‌లో ఉండ‌డం ఇష్టం లేదు.


ఈ క్ర‌మంలోనే త‌న తండ్రి పోటీ చేసిన తూర్పు నియోజ‌క‌వ‌ర్గంపైనే మ‌క్కువ చూపిస్తున్నారు. టీడీపీలో అక్క‌డ గ‌ద్దె స్ట్రాంగ్‌గా ఉండ‌డంతో అవినాష్ కోరిక తీరేలా లేదు. అటు వైసీపీ నుంచి విజ‌య‌సాయిరెడ్డి ద్వారా త‌మ పార్టీలోకి వ‌స్తే విజ‌య‌వాడ తూర్పు ప‌గ్గాలు అప్ప‌గించ‌డంతో పాటు పార్టీ ప‌రంగా ప్ర‌యార్టీ ఇవ్వాల‌న్న ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే అవినాష్ గుడివాడ‌లో బాగా న‌ష్ట‌పోయారు. ఈ క్ర‌మంలోనే ఐదేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్నా టీడీపీకి భ‌విష్య‌త్ ఉంటుంద‌న్న గ్యారెంటీ లేక‌పోవ‌డంతోనే ఆయ‌న వైసీపీలోకి వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. తాను పార్టీ మార‌డం లేద‌ని అవినాష్ ఎంత క్లారిటీ ఇచ్చినా ఆయ‌న మాత్రం టీడీపీలో సంతృప్తితో లేర‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి అవినాష్ పొలిటిక‌ల్ రూటు ఎలా ?  ఉంటుందో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: