ఏటా విద్యుత్‌ నియంత్రణ మండలికి డిస్కమ్‌ల వాస్తవ ఆర్థిక పురోగతిని వివరించాలి. ఇలా చేయడం వల్ల అప్పులెందుకు చేస్తున్నారనే విషయంపై ప్రజల్లో చర్చ జరుగుతుంది. ప్రైవేట్‌ విద్యుత్‌ కొనుగోళ్ల కోసమే గత సర్కార్‌ ఎడాపెడా అప్పులు చేసిందనే నిజం బయటకొస్తుంది. ఈ కారణంగా వాస్తవ ఆర్థిక పరిస్థితిని కమిషన్‌ ముందుకు తేకపోవడంతో ప్రస్తుతం రూ.16 వేల కోట్లకు పైగా అప్పు కనిపిస్తోంది.


అప్పు తీర్చడం మాట దేవుడెరుగు! అప్పుపై  వడ్డీలు కట్టడానికే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురైతే? గత ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇదే. ఫలితంగా ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలు కోలుకోలేని అప్పుల్లోకెళ్లాయి. గత ఐదేళ్లుగా విద్యుత్‌ రంగ ఆర్థిక పరిస్థితి అంతా సవ్యంగా ఉందంటూ టీడీపీ సర్కారు చేసిన ప్రచారం ఉత్తదేనని తేలిపోతోంది. ప్రైవేట్‌ విద్యుత్‌ కొనుగోళ్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టి టీడీపీ సర్కారు ఇబ్బడి ముబ్బడిగా తెచ్చిన అప్పులకు ఏటా రూ.550 కోట్లు వడ్డీనే చెల్లించాల్సి వస్తోంది. ఈ వడ్డీ కోసం కూడా మళ్లీ  అప్పులకు వెళ్లడం గత ప్రభుత్వ హయాంలో కనిపిస్తోంది. 


రాష్ట్ర విభజన నాటికి ఏపీలోని విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రూ.2,998 కోట్ల పెట్టుబడి అప్పు, రూ.7,698 కోట్ల రోజువారీ అప్పు ఉంది. మొత్తం కలిపి అప్పు రూ.10,696 కోట్లుగా ఉంది. 2019 మార్చి నాటికి రూ.ఇది 16,534 కోట్లకు చేరింది. అంటే ఈ ఐదేళ్లల్లో రూ.5,838 కోట్లు కొత్తగా అప్పు చేశారు.ఇక మీదట అప్పులను తగ్గించుకుని ఉన్నవాటి నుంచి ఎలా బయటపడాలనే ఆలోచన చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ దిశగా తోడ్పాటు ఇస్తుందని అధికారులు ఆశిస్తున్నారు .


డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి, ఆదాయ మార్గాలను సకాలంలో ఏపీఈఆర్‌సీ ముందుంచుతామని ఇంధనశాఖ కార్యదర్శి  శ్రీకాంత్‌ నాగులపల్లి తెలిపారు. అప్పులకు వడ్డీలు చెల్లించడానికే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని, దీని నుంచి ఎలా బయటపడాలనే ఆలోచన చేస్తున్నామన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: