జనసేన పార్టీ తొట్ట తొలిగా జగన్ సర్కార్ మీద సమరభేరీ మోగిస్తోంది. విశాఖలో వచ్చే నెల 3న భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులతో ఈ ర్యాలీ నిర్వహించాలని కూడా డిసైడ్ అయింది. ఇవన్నీ సరే కానీ విశాఖలో అతి ముఖ్య నాయకుడు, తాజా ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన ప్రముఖుడు అయిన జేడీ లక్ష్మీనారాయణ ఈ ర్యాలీకి వస్తారా అన్న చర్చ ఇపుడు  సాగుతోంది.


ఓడిన తరువాత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ జరిపిన  పార్టీ సమావేశాల్లో ఎక్కడా జేడీ కనిపించలేదు. అదే సమయంలో పార్టీలో కీలక పదవుల్లో కూడా జేడీకి ఎక్కడా అవకాశం ఇవ్వలేదన్న ప్రచారమూ ఉంది. ఇక జేడీ కూడా ఓడిపోయిన తరువాత పవన్ని పెద్దగా కలిసినదీ లేదని అంటున్నారు. అయితే జేడీ తాను జనసేనలోనే ఉంటానని ఇప్పటికే స్పష్టంగా చెప్పుకొచ్చారు. మరి మేధావిగా, ప్రముఖుడిగా ముద్ర పడిన జేడీ సేవలను జనసేన పార్టీ పరంగా ఉపయోగించుకోవడం లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మా ఇద్దరు భావాలూ ఒక్కటేనని పవన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పుకున్నారు. మరి అటువంటి జేడీ ఇపుడు జనసేనలో చురుకైన పాత్ర నిరహించడంలేదన్నది తెలిసిన విషయమే. 


మరి పవన్ విశాఖనే వేదికగా చేసుకుని భారీ నిరసల ర్యాలీ చేపడితే పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి దాదాపుగా మూడు లక్షల వరకూ ఓట్లు తెచ్చుకున్న జేడీ లక్ష్మీనారాయణ రాకపోతే మాత్రం అది సంచలనమే అవుతుందని అంటున్నారు. అయితే జేడీ ర్యాలీలో పాలుపంచుకుంటారని లోకల్ జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరి చూడాలి జేడీ కనుక ఈ ర్యాలీకి హాజరైతే ఆయన పార్టీలో కొనసాగుతున్నట్లుగానే భావించాల్సిఉంటుంది.  మరి జనసేన ర్యాలీ ఏ విశేషాలు చెబుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: