రాజ‌కీయాల్లోకి ఎప్పుడు వ‌చ్చారు? అనేది కాదు.. రాజ‌కీయాలను ఎంత‌గా ఒంట‌బ‌ట్టించుకున్నారు? అనేది నేటి పాలిటిక్స్‌లో ప్ర‌ధా నంగా మారిపోయింది. సీనియ‌ర్ల‌ను దాటేస్తున్న జూనియ‌ర్ల‌కు ఏపీలో బాగానే పేరుంది. ఇప్పుడు ఈ వ‌రుస‌లోనే చేరిపోయారు సినీ న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ చిన్న‌ల్లుడు, టీడీపీ జూనియ‌ర్ నేత‌, విశాఖ నుంచి ఎంపీగా ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన శ్రీభ‌ర‌త్‌. తాత (గోల్డ్ స్పాట్‌)ఎంవీఎస్ మూర్తి వార‌సుడిగా రాజ‌కీయ రంగం లోకి వ‌చ్చిన శ్రీభ‌ర‌త్‌.. త‌ర్వాత బాల‌య్య కుమార్తెను మ‌నువాడ‌డంతో టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుకు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు.


అంటే .. ఒక ర‌కంగా చంద్ర‌బాబు పెద‌నాన్నో.. చిన్న‌నాన్నో అవుతార‌న్న‌మాట‌. రాజ‌కీయాల్లోకి కొత్త ఎంట్రీ క‌దా.. అప్పుడే ఏం ఒంట‌బ‌డ‌తాయిలే అనుకున్న వారికి శ్రీభ‌ర‌త్ గ‌ట్టి షాకిచ్చారు. తాజాగా ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌లు, విసిరిన విమ‌ర్శ‌ల బాణాల‌ను చూస్తే.. హ‌మ్మ‌.. అప్పుడే బాగానే రాజ‌కీయాల‌ను ఒంట‌బ‌ట్టించుకున్నాడుగా! అని అన‌కుండా ఉండ‌లేరు. ఒక‌ప‌క్క‌, తాత మూర్తి స్థాపించిన‌ గీతం విద్యాసంస్థ‌ల సీఈవోగా ఉంటూనే.. మ‌రోపక్క‌, త‌న‌కంటూ ఓ వ్యాపారం ఉండాల‌ని భావించిన భ‌ర‌త్‌.. సొంత‌గా విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద మెసర్స్‌ వీబీసీ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్ పేరుతో విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ‌ను ప్రారంభించారు.


దీని నుంచి ఉత్ప‌త్తి అయ్యే విద్యుత్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికే విక్ర‌యించారు. అప్ప‌ట్లో సొంత పార్టీ ప్ర‌భుత్వం ఉండ‌డంతో భ‌ర‌త్‌కు అన్నీ.. న‌ల్లేరుపై న‌డ‌క‌గానే సాగిపోయాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆంధ్రాబ్యాంకు నుంచి భారీ ఎత్తున రుణం కూడా పొందారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు రుణం చెల్లించ‌లేద‌ని పేర్కొంటూ.. తాజాగా ఆంధ్రాబ్యాంకు నోటీసులు జారీ చేయ‌డంతోపాటు రుణానికి హామీగా ఉంచిన భూములు, స్థ‌లాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది. భ‌ర‌త్ సంస్థ మొత్తం  సంస్థ మొత్తం రూ.13,65,69,873 బ‌కాయి ఉన్న‌ట్టు బ్యాంకు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.


దీనిపై వెంట‌నే స్పందించిన భ‌ర‌త్‌.. త‌మ‌కు రావాల్సిన బ‌కాయిలు రాలేద‌నో.. లేక త్వ‌ర‌లోనే తీరుస్తామ‌నో.. లేక న‌ష్టాలు వ‌చ్చాయ‌నో.. వివ‌ర‌ణ ఇచ్చి ఉంటే.. వేరేగా ఉండేది. కానీ, ఈ విష‌యాన్ని ఆయ‌న రాజ‌కీయంగా మార్చేశారు. హుందాగా వ్యవహరించాల్సిన భరత్‌ తాను డిఫాల్టర్‌ కావడానికి ట్రాన్స్‌కో బకాయిలే కారణమని పేర్కొంటూ జ‌గ‌న్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. నెపాన్ని సర్కారుపై నెట్టారు.  ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చాలామంది వ్యాపారస్తుల కు బిల్లులు రావడం లేదని, ఉద్యోగులకు జీతాలు రావడం లేదని విమర్శించారు. దీంతో భ‌ర‌త్ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.


దీంతో అసలు వాస్త‌వం ఏంట‌ని చూస్తే.. చంద్ర‌బాబు హ‌యాంలోనే అంటే భ‌ర‌త్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీకి చెందిన ప్ర‌భుత్వం ఉన్న స‌మ‌యంలోనే ఆయ‌న సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు జ‌రిగింది. దీనికి సంబంధించి అప్ప‌టి ట్రాన్స్‌కోనే చెల్లింపులు చేయాల్సి ఉంది. అవి కూడా రూ.2 కోట్ల 52లక్షల 95వేల 540 మాత్ర‌మే. అయితే, భ‌ర‌త్ మాత్రం త‌మ‌కు మూడు కోట్లు రావాల్సి ఉంద‌న్నారు. కానీ, ట్రాన్స్‌కో నుంచి రావాల్సిన బ‌కాయిలు.. అప్ప‌టి ప్ర‌భుత్వం నిలిపివేస్తే.. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప‌డి ఏడ‌వ‌డం, ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయాల‌ని చూడ‌డాన్ని బ‌ట్టి భ‌ర‌త్‌కు త‌క్కువ‌కాలంలోనే ఎక్కువ‌గా రాజ‌కీయాలు అబ్బాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


ఒక వేళ ప్ర‌భుత్వం ఈ బ‌కాయిలు చెల్లించినా.. బ్యాంకు పేర్కొన్న మొత్తం 13 కోట్ల కు పైచిలుకు ఉంది. దానికీ దీనికి కూడా ఎక్క‌డా పొంత లేకుండా పోయింది. ఏదేమైనా.. టీడీపీ నేత‌లు త‌మ త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తూ.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం అనేది ప‌రిపాటిగా మారింనే వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ జాబితాలో ఇప్పుడు భ‌ర‌త్ పేరు కూడా చేరిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: