సెప్టెంబర్ 15వ తేదీ,తూర్పుగోదావరి జిల్లాలో  దేవీపట్నం నుంచి పాపికొండలు విహారయాత్రకు  ఎప్పటిలానే లాంచీలు బయల్దేరాయి. అందరితో పాటు రాయల్ వశిష్ట అనే బోటు కూడా 77 మంది ప్రయాణికులుతో విహారయాత్రను ప్రారంభించారు.తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపం వద్ద  జరిగిన బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో ఏపీతో పాటు,తెలంగాణకు చెందిన వారు కూడా మృతి చెందారు.

అసలు ప్రమాదం ఎలా జరిగింది? వర్షాలు పడుతున్న సమయం. గోదావరిలో వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉంది,మరి అలాంటి సమయంలో పాపికొండలు విహార యాత్రకు ఎలా అనుమితి ఇచ్చారు అనే అంశాలపై పర్యాటకుల బంధువులతోపాటు ప్రజల్లో కూడా గందరగోళం ఏర్పడింది.కొందరు కుటుంబసభ్యులతో, మరికొందరు స్నేహితులతో పాపికొండల అందాలు చూసేందుకు బయల్దేరారు.పాటలు, డాన్సులతో సందడి చేస్తున్నారు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.వారిలో చాలామంది ఒడ్డుకు చేరలేదు. మధ్యాహ్నం సుమారు 1.45 గంటల సమయంలో కచ్చులూరు వద్దకు రాగానే ప్రమాదం చోటు చేసుకుంది.

ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. ఏం జరిగింది అర్థం అయ్యేలోపే చాలా మంది అక్కడిక్కడే జలసమాధి అయ్యారు.ఈ ఘటనపై వశిష్ట బోటు యజమాని వెంకటరమణ కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బోటులో 150 వరకు లైఫ్ జాకెట్స్ ఉన్నాయని  ఆయన చెప్పారు.నిజానికి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పాపికొండలు టూర్‌కి దేవీపట్నం పోలీసులు కూడా వారించారని ఆయన తెలిపారు.

అయితే బోటు డ్రైవర్లు మాత్రం వారి మాట పెడ చెవినపెట్టి  బయలుదేరారని అన్నారు. నదిలో వరద ఉధృతి, బోటుప్రమాదం జరిగిన ప్రాంతంలో సుడిగుండాలు కారణాలు ఏవైనా సరే... మొత్తంమీద అన్ని కలిసి 51మంది ప్రాణాలు బలితీశాయన్నది మాత్రం వాస్తవం. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఆరోజు ఓ చీకటి దినం. 


మరింత సమాచారం తెలుసుకోండి: