అవును క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి కార్యకర్తలో , కార్యకర్తలో అంటూ ఒకటే యాగీ చేస్తున్నారు. ఇపుడు కూడా గ్రామస్ధాయిలోని కార్యకర్తలే త్యాగాలు చేయాలంటున్నారు. ఏ ముహూర్తంలో ఎన్టీయార్ పార్టీని పెట్టారో కానీ కార్యకర్తలే టిడిపి ఆయువుపట్టుగా నిలబడ్డారు.

 

గడచిన 37 ఏళ్ళుగా ఎంతోమంది నేతలు వచ్చారు, వెళ్ళారు కానీ క్రిందిస్ధాయిలో కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా పార్టీతోనే ఉన్నారు.  తమకు పదవులు వచ్చినా రాకపోయినా పట్టించుకోకుండా పార్టీనే అంటిపెట్టుకునుండే డై హార్డ్ ఫ్యాన్ టిడిపి సొంతం.  అలాంటి కార్యకర్తలు కూడా టిడిపి ఓడిపోతే కానీ చంద్రబాబుకు బుద్ధి రాదని మొన్నటి ఎన్నికలకు ముందు అనుకున్నారు.

 

చంద్రబాబు మనస్తత్వం చాలా విచిత్రంగా  ఉంటుంది. అధికారంలో ఉన్నంత కాలం బ్రోకర్లు, వ్యాపారస్తులు, ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలు మాత్రమే చంద్రబాబుకు గుర్తుంటారు. పార్టీ ఓడిపోగానే వెంటనే కార్యకర్తలపై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది.  పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కార్యకర్తలను పట్టుకుని ఊగలాడటం చంద్రబాబుకు బాగా అలవాటైపోయింది.

 

గడచిన నాలుగు నెలలుగా టిడిపిలో జరుగుతున్నదే ప్రత్యక్ష్య సాక్ష్యం. జిల్లాల పర్యటనలో ఉన్నపుడు చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా అధికారంలో ఉన్నపుడు కార్యకర్తలను పట్టించుకోకుండా తప్పు చేశానంటూ పదే పదే విచారం వ్యక్తం చేస్తుండటమే విచిత్రంగా ఉంది.  

 

తాజాగా శ్రీకాకుళం జిల్లా పర్యటనలో మాట్లాడుతూ గ్రామస్ధాయి నుండి సమర్ధవంతమైన నాయకత్వం రావాలంటూనే దేశస్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళు దేశభక్తులయ్యారని చెప్పటంలో అర్ధమేంటి ?  పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే చంద్రబాబే అసలు సమస్య అని అర్ధమవుతోంది.


ఎన్నికల్లో ఓడిపోగానే తానే స్వయంగా నలుగురు రాజ్యసభ ఎంపిలను బిజెపిలోకి పంపేశారు. బిజెపిలో చేరిన నేతల్లో చాలామంది చంద్రబాబు అనుమతి తీసుకునే వెళ్ళారన్నది బహిరంగ రహస్యం. అంటే తన రక్షణకు తన మనుషులందరినీ బిజెపిలోకి పంపిస్తు కార్యకర్తలను మాత్రం పోరాటాలు చేయండి, త్యాగాలకు సిద్ధం కండి అని పిలుపిస్తున్నారంటే సమస్యంతా చంద్రబాబులోనే ఉందని అనిపించటం లేదూ ?


మరింత సమాచారం తెలుసుకోండి: